నిధుల్లేక నిస్తేజం!
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:12 AM
వికారాబాద్ మునిసిపాలిటీ దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కేంద్రం.. బల్దియాలో కనీసం కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. చెక్కుల రూపంలో ట్రెజరీకి పంపిన జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. సాధారణ నిధుల నుంచి నేరుగా కార్మికులకు ప్రతీనెల అందించే అధికారులు.. ఈనెల మాత్రం ట్రెజరీకి చెక్కులు పంపించి చేతులు దులుపుకున్నారు.

వికారాబాద్ మున్సిపాలిటీకి విడుదల కాని స్పెషల్ ఫండ్స్
అభివృద్ధికి దూరంగా బల్దియా
పన్నులు, ఆర్థిక సంఘం నిధులతోనే నెట్టుకొచ్చిన వైనం
సకాలంలో జీతాలు అందక ఇబ్బందుల్లో కార్మికులు
వికారాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ మునిసిపాలిటీ దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కేంద్రం.. బల్దియాలో కనీసం కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. చెక్కుల రూపంలో ట్రెజరీకి పంపిన జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. సాధారణ నిధుల నుంచి నేరుగా కార్మికులకు ప్రతీనెల అందించే అధికారులు.. ఈనెల మాత్రం ట్రెజరీకి చెక్కులు పంపించి చేతులు దులుపుకున్నారు. కాగా, 11 నుంచి సంక్రాంతి సెలవులు ఉండడంతో జీతాలు అందడం కష్టమే. దాంతో పండుగ పూట కార్మికులు పస్తులుండే పరిస్థితిని అధికారులు, పాలకులు కల్పించారు. వికారాబాద్ మునిసిపాలిటీలో 178 మంది కార్మికులు శానిటేషన్ విభాగంలో పనిచేస్తుండగా.. మిగతావారు కంప్యూటర్ ఆపరేటర్లుగా, ఆఫీస్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 250 మంది వరకు పనులు చేస్తుండగా.. వీరికి ప్రతీనెల రూ.50 నుంచి రూ.52లక్షల వరకు మునిసిపాలిటీ నుంచి జీతాలు అందుతాయి.
మంజూరు కాని ప్రత్యేక నిధులు
వికారాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు. బీఆర్‌ఎస్ హయాంలోనూ రూపాయి కూడా మంజూరు కాలేదు. అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. మున్సిపాలిటీకి కేవలం పన్ను రూపంలో, ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ రూపంలో వచ్చే డబ్బుతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈమేరకు జీతాలు చెల్లిస్తూ పలు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు.
అవినీతికి కేరా్‌ఫగా..!
వికారాబాద్ మున్సిపాలిటీ అవినీతికి కేరా్‌ఫగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. బిల్లు కలెక్టర్ల నుంచి ఆర్‌ఐ వరకు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ పరిధిలోని ఇంటి నెంబర్లు, మ్యుటేషన్ల కోసం వచ్చే దరఖాస్తులకు డబ్బు వసూలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అయితే, ఒక్కొక్కరి వద్ద ఒక్కోలా రూ.2వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రెవెన్యూ శాఖతో పాటు మున్సిపాలిటీలోని ఓ అధికారి హస్తం కూడా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా శానిటేషన్ విభాగంలో కార్మికులకు కొనుగోలు చేసిన బట్టలు, సబ్బులు ఇతర సామగ్రి కొనుగోలులో సైతం పెద్దమొత్తంలో అవినీతి జరిగినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అంతకుముందు కమిషనర్‌గా విధులు నిర్వహించిన వ్యక్తి సైతం పట్టణంలో రోడ్డు మధ్యలో తొట్టీలు, రోడ్డుపక్కన మొక్కల పెంపకం కార్యక్రమాలతో అక్షరాల రూ.40 లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేశారని పాలకవర్గ సభ్యులు పలు సందర్భాల్లో తెలిపారు.
కనిపించని అభివృద్ధి
ఐదేళ్లలో మున్సిపాలిటీ పరిధిలోని పలుచోట్ల సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు చిన్న చిన్న పనులు మినహా పెద్దగా అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవు. పన్నులు, ఇతరత్రా వాటిపై వచ్చే డబ్బు కేవలం జీతాలు, మెయింటనెన్స్‌కే సరిపోయేవి. వికారాబాద్ శివసాగర్ చెరువులో పుష్కలంగా నీరు ఉన్నా.. వినియోగానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీని ప్రక్షాళన చేస్తానని చెబుతున్న తరుణంలో.. ఆ నదికి జన్మ స్థలమైన వికారాబాద్‌లోనే నీరు కలుషితమౌతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పట్టణంలోని సీవరేజ్ ట్యాంక్ ద్వారా వ్యర్థాలను నేరుగా మూసీలోకి వదులుతున్నారు. గత నాలుగేళ్లుగా ఐజీడీ (సీవరేజ్) ట్యాంక్‌లో మిషన్లు పనిచేయక పట్టణంలోని డ్రైనేజీ నేరుగా ఫిల్టర్ కాకుండానే మూసీలో కలుస్తోంది.
సంజీవరావు హయాంలో రూ.20 కోట్ల నిధుల మంజూరు
దివంగత సంజీవరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ పాలకవర్గానికి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటితో శివారెడ్డిపేట, కొత్తగడి, అనంతగిరి, బుగ్గరోడ్ల వెడల్పుతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూ.5కోట్లను పార్కు ఏర్పాటు కోసం కేటాయించారు. ఆ నిధులతోనే పట్టణంలో కొంతమేర రోడ్డు బాగు చేశారు. అయితే, పార్కును ఏర్పాటు పనులు ముందుకు సాగలేదు. శివసాగర్ సమీపంలో ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. పట్టణానికి దూరంగా ఉన్న ప్రదేశంలో పార్కు ఎందుకని అలాగే వదిలేశారు. ఆ డబ్బులను సైతం ప్రస్తుత పాలకవర్గం దారి మల్లించి సాధారణ నిధుల్లో చేర్చి ఖర్చు చేశారు.
అధ్వానంగా విలీన గ్రామాల పరిస్థితి
వికారాబాద్ మునిసిపాలిటీలో కొత్తగా కలిసిన ఆరు గ్రామాల పరిస్థితి అధ్యానంగా మారింది. మద్గుల్ చిట్టంపల్లి, గుడుపల్లి, బూర్గుపల్లి, గిరిగేట్‌పల్లి, ధన్నారం, కొంపల్లి గ్రామాల్లో కొంతమేర అభివృద్ధి కూడా జరుగలేదు. ఆయా గ్రామాల ప్రజలు గతంలో ఉపాధి హామీ పనులు ద్వారానైనా కొంత డబ్బు పోగుచేసుకునేవారు. మున్సిపాలిటీలో కలపడంతో ఆ పనులు లేకపోగా సమయానికి ఇంటి ట్యాక్సులు చెల్లించడం తప్ప.. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం అభివృద్ధి సైతం కుంటుపడింది. దాంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
చైర్‌పర్సన్ పదవీ కాలంపై పంచాయితీ!
బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మున్సిపల్ చైర్మన్ విషయంలో రెండున్నరేళ్ల ఒప్పందం చేయడం.. ఆ తరువాత కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. దాంతో చైర్‌పర్సన్ మంజులా రమేష్ ఇతరులకు పదవి ఇవ్వడంపై నొచ్చుకున్నారు. మిగతా రెండున్నరేళ్లు తామే చైర్‌పర్సన్‌గా ఉంటామని భీష్మించడంతో అప్పట్లో బడా నేతల సమక్షంలో పంచాయితీ నడిచింది. ఈక్రమంలో చివరకు చైర్‌పర్సన్ మంజులా రమేష్ తన పంతం నెగ్గించుకుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కరోనా కాలంలో తోడుగా..
తన ఐదేళ్ల పాలనలో చైర్‌పర్సన్ మంజులా రమేష్ ప్రజల్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడ్డారు. దాంతో మున్సిపాలిటీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో రెడ్‌జోన్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఆమె ప్రజలకు సేవలందించారు. వారికి అవసరమైన నిత్యావసరాలు సమకూర్చారు. వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
త్వరలో మున్సిపాలిటీకి నిధులు
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చొరవతో మున్సిపాలిటీకి త్వరలో నిధులు రానున్నాయి. ఇన్నాళ్లు మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాం. కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పని చేశాం. పాలకవర్గం పూర్తి స్థాయిలో సహకరించింది.
- మంజులా రమేష్, చైర్‌పర్సన్, వికారాబాద్ మున్సిపాలిటీ