పామాయిల్‌కు ప్రోత్సాహం!
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:11 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. వరి సాగు మాదిరిగా ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆయిల్ ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పంటలకు ఉమ్మడి జిల్లా నేలలు అనుకూలం
జిల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
ఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 1,485 ఎకరాలు
సబ్సిడీపై మొక్కలు, ఎరువుల అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. వరి సాగు మాదిరిగా ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆయిల్ ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్పును అందిస్తుంది. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రంగారెడ్డి అర్బన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. రైతులకు సాగుపై ఆసక్తి కలిగించేందుకు ఉద్యాన వన శాఖ అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మూడు వేల ఎకరాలలో పంటను సాగు జరిగేలా జిల్లా ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1,485 ఎకరాలలో పంట సాగు చేయించడంలో ఈ శాఖ అధికారులు సఫలమయ్యారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. రానున్న పదేళ్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పంటసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు
దేశంలో వంట నూనె వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని అధిగమించేందుకు ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమైంది. ఆయిల్ పామ్ సాగుతో మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో తెలంగాణ రైతులు కూడా రాణించాలని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్కల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు అనువైన నేలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జిల్లాల్లో ఐదు కంపెనీలు ఏర్పాటు చేసి ఆయిల్ పామ్‌ను కొనుగోలు చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి.
100 శాతం రాయితీపై డ్రిప్పు
ఆయిల్‌పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను వదం శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. వెనుకబడిన తరగతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు. 5 హెక్టార్ల వరకు డ్రిప్పు రాయితీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయిల్‌పామ్ రైతులకు 12.5 ఎకరాల వరకు డ్రిప్పు ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు.
రాయితీ ఇలా...
ఎకరం ఆయిల్ పామ్ సాగుకు మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు, ఎరువుల యాజమాన్యం కోసం రూ.50 వేల రాయితీ కల్పించనున్నారు. మొక్కలకు రూ.11,600, బిందు సేద్యం కోసం రూ.22,518 రాయితీ ఇవ్వనున్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు ఎకరానికి అంతర పంటల కోసం రూ.2100, ఆయిల్ పామ్ తోట యాజమాన్యం కోసం ఎరువులకు రూ.2,100, ఒక సంవత్సరానికి రూ.4200 చొప్పున రన్నింగ్ బ్యాంకు ఖాతాలో ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత జమ చేస్తారు.
నిరంతర ఆదాయం
ఆయిల్ పాం మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏళ్ల్ల పాటు నిరంతరం ఆదాయం పొందవచ్చు. మొదటి మూడేళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ తోటకు తెగుళ్లు, చీడ పురుగుల బెడద చాలా తక్కువ. తుపాన్, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా అడవి పందులు, దొంగల బెడద ఉండదు. రవాణా, మార్కెటింగ్, ప్రొసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
నాటిన ఐదేళ్ల తర్వాత దిగుబడి
ఆయిల్‌పామ్ మొక్క నాటిన సంవత్సరం నుంచి ఐదేళ్ల తర్వాత గెలలు వేయడం ద్వారా దిగుబడి మొదలవుతుంది. ఇలా 25-30 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. సుమారుగా ఒక ఎకరానికి 10-12 టన్నులు దిగుబడి ఉంటుంది. సగటున ఒక టన్ను గెలల ధర సుమారు రూ. 10 వేలు ఉంటుంది. దీని ద్వారా ఒక రైతుకు ఒక ఎకరాకు రూ.1.25 లక్షల ఆదాయం పొందవచ్చు. ఈ విధానంలో 5 ఎకరాలకు రూ. 6.25 లక్షల నికర ఆదాయం పొందుతారు. 5 ఎకరాలకు గాను 20 సంవత్సరాలలో రూ.1.20 కోట్ల నికర ఆదాయం పొందుతారు.
అర్హులైన రైతులు వీరే..
అనువైన భూమి, పట్టాదారు పాస్ పుస్తకం, బోరు, బావి, కరెంట్ సౌకర్యం ఉన్న ప్రతి రైతు ఆయిల్ పామ్ తోటను సాగు చేసుకోవచ్చు. రైతు ఎన్ని ఎకరాల్లో అయినా పంట వేసుకునే వెసులుబాటు ఉంటుంది. 12.50 ఎకరాలకు వరకు మాత్రమే డ్రిప్ రాయితీ ఉంటుంది.
వివరాల కోసం..
ఇబ్రహీంపట్నం, యాచారం, బాలాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, మాడ్గుల, మంచాల మండలాలకు చెందిన రైతులు ఉద్యానవన శాఖ అధికారి నవీన (8977714219)ను సంప్రదించాలి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాలకు చెందిన రైతులు ఉద్యానశాఖ అధికారి కీర్తి కృష్ణ (8977714222) సంప్రదించాలి. అలాగే ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్ రైతులు ఉద్యానశాఖ అధికారి సౌమ్య (8977714221)ను సంప్రదించాలి. అదేవిధంగా షాద్‌నగర్, కేశంపేట్, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడెం, కొందుర్గు మండలాలకు చెందిన రైతులు ఉద్యానశాఖ అధికారి హిమబిందు (8977714220)ను సంప్రదించాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ పంట సాగు చేసుకుంటే నిరంతర ఆదాయం పొందేందుకు అవకాశముంది. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన భూమి ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. రైతులకు ప్రభుత్వం మొక్కలు, ఎరువులు, డ్రిప్పు సబ్సిడీపై అందిస్తుంది. ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
- కె.సురేష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలో శ్రీరాంరెడ్డి, రిత్విక్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ (హార్టికల్చర్) సహకారంతో మెగా ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ... జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు ఈ ఏడాది 3000 ఎకరాల్లో లక్ష్యం పెట్టుకున్నామని, ప్రస్తుతం 18 మండలాల్లో 330 ఎకరాల్లో ఈ మొక్కలు నాటుతున్నామన్నారు. హార్టికల్చర్ అధికారి సురే్‌షరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సర్దార్‌నగర్ ఏఎంసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు పాల్గొన్నారు.
పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
షాద్‌నగర్‌రూరల్ : ఆయిల్‌పామ్ పంటలతో అధిక లాభాలు సాఽధించవచ్చని ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి సురేష్ తెలిపారు. ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల శివారులో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఏపీడీ కిషన్‌రావు, హెచ్‌వో హిమబిందు, వాల్యూఆయిల్ పరిశ్రమ వైస్‌ప్రెసిడెంట్ రామ్మోహన్‌రావు, ఎండీ రామకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.