Ramchander Rao: రాహుల్ డైరెక్షన్‌లోనే కాంగ్రెస్ ఢిల్లీ డ్రామా
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:02 AM
బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ డైరెక్షన్‌లోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా
ముస్లింలకు 10 శాతం తీసేస్తే బీసీ బిల్లుకు మద్దతిస్తామని వెల్లడి
గోదావరిఖని/ కాగజ్‌నగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ డైరెక్షన్‌లోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు యాక్టర్లు, పెయిడ్ ఆర్టిస్టులుగా మారారన్నారు. పెద్దపల్లి జిల్లా గంగానగర్, కుమరం భీం జిల్లా కాగజ్ నగర్‌ల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి, అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి.. ఇప్పుడు ఢిల్లీకెందుకెళ్లారని ప్రశ్నించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే తాము బీసీ బిల్లుకు మద్దతిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఓబీసీ నేత అని ప్రకటించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేసీఆర్ కుటుంబానికి చెందిన నలుగురే బాధ్యులని, ఈటలకు సంబంధం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిపై బ్యారేజీ కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు తరలించాలన్నారు.