రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:34 AM
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణ మంజూరు పత్రాల అందజేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
నేటి రుణ మంజూరు పత్రాల అందజేత వాయిదా
కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన
పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణ మంజూరు పత్రాల అందజేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వాస్తవానికి సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈ నెల 9వరకు లబ్ధిదారులకు ఈ పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వీటి పంపిణీకి సంబంధించి ఆదివారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. ఎట్టకేలకు సోమవారం జరగాల్సిన రుణ మంజూరు పత్రాల అందజేత విషయంపై ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వాయిదా వేసినట్లు ప్రకటించారు. సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు పథకం అందకుండా చూడాలన్న ఫిర్యాదులు పెద్దఎత్తున వచ్చాయని మంత్రులు సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుల స్ర్కీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాల ను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. మరింత లోతు గా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఒక్క అనర్హుడికీ రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని తెలిపారు. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా.. ఈ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ కారణాలూ పరిగణనలోకి..
రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులోంచి 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి 9 వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందని అంతా ఎదురుచూశారు. మొదటి విడతలో రూ.50వేల నుంచి రూ.లక్షలోపు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే మంజూరు పత్రాలు అందజేస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. కేటగిరీ-1లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు దరఖాస్తుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాదాపు 2.8 లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూ రు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా 1,32,634 మందే దరఖాస్తు చేసుకున్నారు. రూ.50వేలలోపు యూనిట్‌కు పూర్తి రాయితీ ప్రకటించినా 39,401 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. రూ.లక్షలోపు యూనిట్లకు 90ు రాయితీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కేటగిరీల్లో 93,233 దరఖాస్తులు వచ్చాయి. గరిష్ఠ ధర రూ.4 లక్షలు కలిగిన యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే దరఖాస్తులో పేర్కొన్న యూనిట్లను ఆ తర్వాత కూడా అభ్యర్థి మార్చుకునే వెసులుబాటు ఉండడంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..