Share News

Rahul Gandhi: రోహిత్‌ వేముల చట్టం చేయండి

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:51 AM

విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు రోహిత్‌ వేముల చట్టాన్ని రూపొందించాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Rahul Gandhi: రోహిత్‌ వేముల చట్టం చేయండి

  • విద్యాసంస్థల్లో కులవివక్ష రూపుమాపండి

  • రేవంత్‌రెడ్డికి రాహుల్‌ గాంధీ లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు రోహిత్‌ వేముల చట్టాన్ని రూపొందించాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. నేటికీ దేశంలోని పలు విద్యా సంస్థల్లో లక్షలాది మంది దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల విద్యార్థులు దారుణమైన అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కుల వివక్ష కారణంగానే రోహిత్‌ వేముల, పాయల్‌ తడ్వి, దర్శన్‌ సోలంకి వంటి వారు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీటికి ముగింపు పలకాలన్నారు. దేశంలో మరే బిడ్డా అంబేడ్కర్‌, రోహిత్‌ వేములలా వివక్షకు గురి కాకూడదని ఆకాంక్షించారు. రోహిత్‌ వేముల చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని కోరారు.


అలాగే, అంబేడ్కర్‌ ఎదుర్కొన్న కుల వివక్ష గురించి రాహుల్‌ లేఖలో ప్రస్తావించారు. ‘‘అక్కడ పుష్కలంగా ఆహారం ఉంది. మాకు బాగా ఆకలి వేస్తోంది. అయినా మేం తిండి లేకుండానే నిద్రపోవాల్సిన దుస్థితి. ఎందుకంటే మేం అంటరాని వాళ్లం. అందుకే మాకు నీరు కూడా దొరకలేదు’’ అన్న అంబేడ్కర్‌ వ్యాఖ్యలను గుర్తుచేశారు. అలాగే, ‘‘నేను అంటరాని వాడినని నాకు తెలుసు. పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి కూర్చోలేననీ తెలుసు. నేను ఒక మూలన కూర్చోవాలనీ తెలుసు’’ అన్న వ్యాఖ్యలను కూడా రాహుల్‌ ప్రస్తావించారు. కాగా, కుల వివక్ష నిర్మూలనకు రోహిత్‌ వేముల చట్టాన్ని చేయడంపై రాహుల్‌ గాంధీ ఇటీవల కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌కు కూడా లేఖలు రాశారు.

Updated Date - Apr 22 , 2025 | 03:51 AM