Lab Technician: రేపు ఎల్టీ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:41 AM
ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేయనుందని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
స్టాఫ్‌నర్సుల తుది జాబితా అక్టోబరులో: వైద్య ఆరోగ్యశాఖ
వైద్యశాఖలో 6,269 పోస్టుల ఫలితాలపై స్పష్టత
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేయనుందని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మెరిట్ జాబితా విడుదల కాగానే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. గతేడాది 1,284 ఎల్టీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అయితే ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులకిచ్చిన వెయిటేజీపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్నిచోట్ల నకిలీ ధ్రువపత్రాలు పెట్టినట్లు మెడికల్ బోర్డు దృష్టికొచ్చింది. దాంతో వెయిటేజీ సర్టిఫికేట్స్ అన్నింటిని జిల్లాలకు పంపి డీఎంహెచ్‌వోలతో అవి సరైనవేనని ధ్రువీకరించుకోవడంతో తీవ్ర జాప్యమైంది. దీనిపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెడికల్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పోస్టుల తుది జాబితా విడుదలపై వైద్యశాఖ ప్రకటన చేసింది.
అలాగే ఈ వారాంతంలో 2,322 స్టాఫ్‌నర్స్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను కూడా మెడికల్ బోర్డు విడుదల చేయనుందని వైద్యశాఖ వెల్లడించింది. ఆ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. సెలక్షన్ జాబితాను అక్టోబరులో విడుదల చేస్తామని ప్రకటించింది. అలాగే 1931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టుల మెరిట్ జాబితాను ఈ నెల 20న విడుదల చేస్తామని, వాటిపై ఆ రోజు నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించింది. సెలక్షన్ తుది జాబితాను నవంబరులో విడుదల చేస్తామని ప్రకటించింది. అలాగే 732 ఫార్మసిస్టు పోస్టుల విషయంలో హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో అది ఒక కొలిక్కి రాగానే తుది జాబితాను విడుదల చేస్తామని ప్రకటించింది. వైద్యశాఖ తాజా ప్రకటనతో ఆ శాఖలో 6,269 పోస్టుల ఫలితాలపై స్పష్టత ఇచ్చినట్లయింది.