Share News

ప్రముఖ కవి సాంధ్యశ్రీ ఇక లేరు

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:17 AM

సాంధ్యశ్రీగా తెలుగు కవితాలోకానికి సుపరిచితులైన ప్రముఖ కవి పుచ్చా లక్ష్మీనరసింహ శాస్త్రి (73) ఇక లేరు.

ప్రముఖ కవి సాంధ్యశ్రీ ఇక లేరు

  • ఈ నెల 17న హఠాన్మరణం, ముగిసిన అంత్యక్రియలు

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరణ వార్త

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సాంధ్యశ్రీగా తెలుగు కవితాలోకానికి సుపరిచితులైన ప్రముఖ కవి పుచ్చా లక్ష్మీనరసింహ శాస్త్రి (73) ఇక లేరు. కొంతకాలంగా హృద్రోగ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 17న అల్వాల్‌లోని తన స్వగృహంలో హఠాన్మరణం చెందారు. సాంధ్యశ్రీ మరణవార్త సాహితీలోకానికి ఆలస్యంగా తెలిసింది. సాంధ్యశ్రీ అంత్యక్రియలు జనవరి 18న అల్వాల్‌లోని శ్మశాన వాటికలో పూర్తయ్యాయని వారి కుమార్తె చెప్పారు. సాంధ్యశ్రీ స్వస్థలం ఏపీలోని తెనాలి దగ్గర దంతలూరు. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణతో దగ్గరి బంధుత్వం ఉండడంతో, ఆయన సాన్నిహిత్యంలో బాల్యాన్ని గడిపారు. గేయ, వచన కవిత్వంతో పాటు నాటకం, విమర్శ తదితర ప్రక్రియల్లోనూ సాంధ్యశ్రీ సాహిత్య సృజన చేశారు.


ఆయన రాసిన అవి తుంగభద్ర, అంతర గాంధారం, నగ్న చిత్రాలు, పుప్పొడి చినుకులు, చెట్టు ఒక పద్యం, కడలి గడప మీద గొంతు జెండా, గుమ్మం తొక్కిన జ్ఞాపకాలు తదితర కవితా సంపుటాలు, తల్లీ!భూదేవి నాటకం ప్రచురితమయ్యాయి. సాంధ్యశ్రీ రచనలు మరికొన్ని ముద్రితం కావాల్సి ఉందని ఆయన స్నేహితుడు ఎ.రజా హుస్సేన్‌ తెలిపారు. సాంధ్యశ్రీని కవితా శిల్పిగా, అక్షరయోగిగా గుంటూరు శేషేంద్ర శర్మ, వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వంటి సాహిత్య దిగ్గజాలు అభివర్ణించిన విషయాన్ని రజా హుస్సేన్‌ గుర్తు చేసుకున్నారు. కవిత్వం కవిత్వం కోసమే అనే విశ్వాసాన్ని రచనల ద్వారా ప్రకటించిన కవి సాంధ్యశ్రీ అంటూ.. సాంధ్యశ్రీ మరణానికి ప్రముఖ కవి శిఖామణి సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 20 , 2025 | 05:17 AM