Share News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సిట్‌తో సీవీ ఆనంద్‌ సమీక్ష

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:36 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు త్వరలో సిట్‌ ముందు హాజరు కావనున్నారు. ఆయనపై ఎస్‌ఐబీ సీక్రెట్‌ రిజర్వ్‌ నిధుల దుర్వినియోగం, రియల్‌ ఎస్టేట్‌లో పాత్ర వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సిట్‌తో సీవీ ఆనంద్‌ సమీక్ష

ప్రభాకర్‌రావు సిట్‌ ముందుకు రానున్న నేపథ్యంలోనే భేటీ

కర్ణాటక మఠం భూముల సెటిల్‌మెంట్‌లో ప్రభాకర్‌రావు

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌పై ఉన్నతాధికారులకు మౌఖిక ఫిర్యాదులు

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ(స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు త్వరలో సిట్‌ ముందు హజరుకానున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సిట్‌ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసే కాకుండా ఎస్‌ఐబీలో పనిచేసిన సమయంలో ప్రభాకర్‌రావు సీక్రెట్‌ రిజర్వ్‌(ఎ్‌సఆర్‌) ఫండ్స్‌ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపైనా చర్చించారు. మావోయిస్టు ఆపరేషన్లకు వాడాల్సిన ఆ నిధులపై ఆడిటింగ్‌ ఉండదని, ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ప్రభాకర్‌రావు అధికార దుర్వినియోగానికి సంబంధించి ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కర్నాటకలోని ఒక మఠానికి సంబంధించిన ఆస్తులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఆ ఆస్తులను 2016-18 మధ్య కాలంలో పాతబస్తీకి చెందిన ఒక నేతకు కట్టబెట్టడంలో ప్రభాకర్‌రావు చొరవ చూపించారని, ఈ క్రమంలో కొందరిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.


2022-2023 మధ్యలో ప్రభుత్వంలోని ఒక పెద్దమనిషి కోసం కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ప్రభాకర్‌రావు టీం బెదిరించిందన్న ఆరోపణలున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావును తొలుత టెక్నికల్‌ డాటా ఆధారంగా విచారించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టు అయిన పోలీసు అధికారులంతా పై అధికారి చెబితేనే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డామని స్పష్టం చేసిన క్రమంలో.. పై అధికారి అయిన ప్రభాకర్‌రావు చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపై ప్రశ్నించడానికి సిట్‌ అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్రభాకర్‌రావు దర్యాప్తును ఎదుర్కోవడానికి పూర్తిస్థాయి కసరత్తు చేసుకుని ఉంటారని, అరెస్టు అయిన వారి వాంగ్మూలాలు, చార్జిషీట్లు స్టడీ చేశారని, అందువల్ల ఆయన అక్రమాలను నిరూపించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు అవసరమని ఉన్నతాధికారులు సిట్‌ బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావుపై ఇప్పట్లో కొత్త కేసులు ఉండకపోవచ్చని, ఆయనపై స్పష్టమైన ఫిర్యాదు ఉంటేనే కొత్త కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:36 AM