Share News

Land Scam: ఎన్కెపల్లి భూములపై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:47 AM

రాజధాని హైదరాబాద్‌ శివార్లలో.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎన్కెపల్లిలో..

Land Scam: ఎన్కెపల్లి భూములపై దర్యాప్తు ముమ్మరం

  • అజ్ఞాతంలోకి డప్పు రమేశ్‌.. వివరాలు సేరిస్తున్న అధికారులు

  • ఆ భూముల్లో సాగుచేస్తున్న 26మంది రైతులకు పట్టాల పంపిణీ

  • మరో 10మందికి నేడు అందజేయనున్నట్టు తెలిపిన అధికారులు

మొయినాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ శివార్లలో.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎన్కెపల్లిలో జరిగినభూకుంభకోణంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్కెపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 180లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో అమ్మేందుకు యత్నించినవారిలో గ్రామస్థులు మాత్రమే ఉన్నారా? బయటి వ్యక్తుల హస్తం కూడా ఉందా? అనే వివరాలు సేకరిస్తున్నారు. మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రెవెన్యూ అధికారులు ఫోర్జరీ పొజిషన్‌ పత్రాల వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన డప్పు రమేశ్‌.. తన గుట్టు రట్టు కావడంతో ఫోన్‌ స్విచాఫ్‌ చేసేసి, మంగళవారం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతణ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ వ్యవహారంలో అతడు ముందుండి క్రయవిక్రయాలు జరిపినప్పటికీ అతని వెనక బడా నేతలు ఉన్నారనే చర్చ జరుగుతోంది. అతణ్ని అదుపులోకి తీసుకుంటే తనతోపాటు ఎవరెవరు ఉన్నారనే విషయం తెలుస్తుందని పోలీసులు, రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.


పట్టాల అందజేత..

ప్రభుత్వం గోశాల నిర్మాణం కోసం తీసుకుంటున్న భూమిలో సాగు చేసుకుంటున్న 26 మంది రైతులకు.. ఎకరానికి 300 గజాల చొప్పున కేటాయిస్తూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డితో కలిసి కేటాయింపు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఆ స్థలాలను అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. దళారుల మాటలు నమ్మకుండా మిగతా రైతులు సైతం ముందుకొచ్చి పట్టాలు తీసుకోవాలని సూచించారు. ఈ భూమిలో మొత్తం 46 కుటుంబాలు సాగు చేసుకుంటుండగా మంగళారంతొమ్మిది కుటుంబాలకు చెందిన 26 మంది రైతులకు ఇచ్చారు. అయితే.. పట్టాలు తీసుకునేందుకు వస్తున్న ఆ 26 మందినీ మిగతావారు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు.

Updated Date - Jul 16 , 2025 | 05:47 AM