Share News

Probe Hinges on Prabhakar Rao Testimony: కక్కించేదెలా?

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:23 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే.. ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పెదవి విప్పాలి....

Probe Hinges on Prabhakar Rao Testimony: కక్కించేదెలా?

  • ప్రభాకర్‌రావు నోరు తెరిపించడమే సిట్‌ లక్ష్యం

  • జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం?

  • అందుకే సీనియర్‌ పోలీస్‌ అధికారులకు బాధ్యతలు!

  • ‘సమష్టి’గా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం

  • ప్రభాకర్‌రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు

  • అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే.. ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) బలోపేతం చేసింది. ఏడు రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్‌రావు సహకరించకపోవడం, దీంతో సిట్‌కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు సిట్‌ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతకవైఖరితో వ్యవహరించారనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీనియర్‌ ఐపీఎ్‌సలతోపాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పైగా తొమ్మిది మంది అధికారులను బృందంలో చేర్చడం ద్వారా.. కేసును వివిధ కోణాల్లో పరిశీలించి సమిష్టిగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ ప్రధానంగా రెండు కోణాల్లో సాగుతోంది. ట్యాపింగ్‌కు సంబంధించిన డిజిటల్‌ సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒక కోణం. మావోయిస్టుల పేరిట జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ప్రముఖ వ్యక్తుల ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేయడం కోసం ఎందుకు అనుమతులు తీసుకున్నారు? ఇలా చేయమని చెప్పింది ఎవరు? ట్యాపింగ్‌ జరిగిన తర్వాత ఆ సమాచారాన్ని ఆదేశాలిచ్చిన వారికి ఏ విధంగా అందజేసేవారు అనేది రెండో కోణం. ఈ రెండింటిలో ఎస్‌ఐబీ కార్యాలయంలో డిజిటల్‌ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయమని ఆదేశించింది నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అని ఈ నేరానికి పాల్పడిన డీఎస్పీ ప్రణీత్‌రావు ఇప్పటికే అంగీకరించారు.


ఆ ఆదేశాలు ఎవరిచ్చారు?

ప్రభాకర్‌రావును విచారించినప్పుడు సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించగా.. ఇది రొటీన్‌ వ్యవహారమేనని, తన ఉన్నతాధికారులు చెప్పినట్లు చేశానని ఆయన తెలిపినట్లు సమాచారం. అయితే, అప్పట్లో ప్రభాకర్‌రావుపై ఉన్నతాధికారిగా పనిచేసిన నిఘా విభాగం బాస్‌ను ఈ విషయమై వివరణ కోరినపుడు ఆయన మరో రకంగా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. అంటే.. ఇక్కడ ప్రభాకర్‌రావు తప్పు చెప్పారా? ప్రభాకర్‌రావును ఉన్నతాధికారి కాకుండా మరెవరైనా ఆదేశించారా? అనే విషయాలను ఇప్పటివరకు సిట్‌ తెలుసుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ విషయాన్ని నూతన సిట్‌ బృందం సీరియ్‌సగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్‌ నంబర్లతోపాటు ఇతర ముఖ్యుల ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేయమని ఆదేశించింది ఎవరు? అనే విషయంలోనూ సిట్‌ బృందం విజయం సాధించలేకపోయింది. దీంతో, విచారణలో ఉన్న ప్రభాకర్‌రావు నోరు విప్పించాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించడం నూతన సిట్‌ ముందున్న ప్రధాన సవాల్‌. దీనిని అధిగమించి కుట్రకోణాన్ని వెలికి తీయడానికి డీజీపీ శివధర్‌రెడ్డి గడువు విధించడంతో సిట్‌ ఇక దూకుడుగా ముందుకు వెళ్లవచ్చని తెలుస్తోంది.


అందరూ సమర్థులే..

సిట్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న సజ్జనార్‌ అనేక క్లిష్టమైన కేసులను ఛేదించిన అనుభవం ఉన్నవారు. ఆయన టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌. రూ.వేల కోట్ల మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ టీం గుట్లు విప్పిన అధికారి. ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణ అత్యంత ముఖ్యం కావడంతో మొత్తం పర్యవేక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. రామగుండం సీపీగా ఉన్న అంబర్‌ కిశోర్‌ ఝా.. గతంలో హైదరాబాద్‌ సౌత్‌జోన్‌లో పనిచేసినవారు కావడంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లోనూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన అంబర్‌ కిషోర్‌.. సాంకేతిక పరిశోధనలో ముందుండేవారు. సిట్‌లో నియమితుడైన మరో అధికారి సిద్దిపేట కమిషనర్‌ విజయ్‌కుమార్‌.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రారంభం నుంచి విచారణలో కీలక పాత్ర పోషించారు. కేసు స్వరూపమంతా ఈయనకు తెలియడంతోపాటు మిగిలిపోయిన లింకులేవీ? వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశంలో ఈయన సేవలు సిట్‌కు ఉపయోగపడే అవకాశాలున్నాయి. మాదాపూర్‌ డీసీపీగా పనిచేస్తున్న రితిరాజ్‌ ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన లొసుగులు, వాటిని నిందితులు ఏ విధంగా వినియోగించుకున్నారన్న అంశాలను గుర్తించడంలో రితిరాజ్‌ సిట్‌కు ఎస్సెట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తు బృందంలోని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, రవీందర్‌రెడ్డి, కేఎస్‌ రావు, సీహెచ్‌ శ్రీధర్‌, నాగేందర్‌ రావుల ట్రాక్‌ రికార్డు బాగా ఉండటం, వారు గతంలో ఛేదించిన కేసుల నేపథ్యంలో వీరిని సిట్‌ బృందంలోకి తీసుకున్నారని సమాచారం. అదేవిధంగా ఈ కేసును మొదటినుంచీ విచారిస్తున్న ఏసీపీ వెంకటగిరిని అలాగే కొనసాగించడం వల్ల కేసు పరిష్కారానికి కావాల్సిన స్కెచ్‌ ఆయన ఇవ్వగలరని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్‌రావు కస్టడీని మరో ఏడు రోజులు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగింపు కూడా కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 20 , 2025 | 05:23 AM