Minister Seethakka: ఎంత ఉన్నత స్థాయికెదిగినా అస్తిత్వాన్ని మరువొద్దు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:21 AM
మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. మన అస్తిత్వాన్ని, పూర్వ స్థితిని మరిచిపోవద్దని
కార్పొరేట్ హోటళ్లలో పూర్వీకుల ఆహారం లభ్యం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క
గిరిజన సంస్కృతి, సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యం
గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
డప్పు చప్పుళ్లతో హోరెత్తిన ఆదివాసీ భవన్
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. మన అస్తిత్వాన్ని, పూర్వ స్థితిని మరిచిపోవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఒకనాడు పేదవారి ఆహారంగా పరిగణించిన మన పూర్వీకుల తిండి.. ప్రస్తుతం కార్పొరేట్ హోటళ్లలో లభ్యమవుతోందని, దీన్ని బట్టే మన ఆహారం ఎంత బలవర్ధకమైందో తెలుస్తోందన్నారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో శనివారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. కరోనా వేళ పట్టణాల్లో ధనవంతుల కంటే గ్రామాల్లోని ఆదివాసీలే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేశారు. విద్య ఎంతో ముఖ్యమని చెంచుపేటల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేశామన్న సీతక్క.. బాగా చదువుకుని ఎంత ఉన్నత స్థాయికెళ్లినా సొంతూరిని మర్చిపోవద్దని హితవు చెప్పారు. గిరిజన ఆదివాసీలతో కలిసి బోనం.. విల్లు ఎక్కుపెట్టడంతోపాటు నృత్యం చేస్తూ వారిని ఉత్సాహ పరిచారు. ఆదివాసీ, లంబాడ, కోయ, గోండు, చెంచు, కొలం తదితర జాతుల ప్రజలు సంప్రదాయ కళారూపాలు, నృత్యాలతో ఆలరించారు. ఆదివాసీ భవన్ కళాకారుల డప్పుచప్పుళ్లతో మార్మోగింది. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ తన ఆటపాటలతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పలు నూతన పథకాలతో గిరిజన సంస్కృతి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే ఆదివాసీలకు భూహక్కుల నుంచి విద్య, ఆరోగ్యం, సంస్కృతి వరకూ పెద్ద పీట వేశామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే వేడుక మాత్రమే కాదని, గిరిజన జాతి హక్కులను కాపాడే పండుగ అని పేర్కొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి గిరిజన శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే తండాల అభివృద్ధి, ఉపాధి హామీ, ఆదివాసీలకు పోడు భూములు సాధ్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి అలగు వర్షిణి, అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, టీసీఆర్ డైరెక్టర్ సముజ్వాల తదితరులు పాల్గొన్నారు.