Share News

గ్రూప్‌-1 ఫలితాలు.. తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:14 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని.. మూల్యాంకనంలో పెద్దఎత్తున లోపాలున్నాయని కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు.

గ్రూప్‌-1 ఫలితాలు.. తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి

  • మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే

  • ఉర్దూ మీడియం అభ్యర్థుల.. మార్కులను బహిర్గతం చేయాలి

  • మీడియం వారీగా ర్యాంకింగ్‌ ప్రకటించాలి

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

  • వ్యాపమ్‌ను మించి.. గ్రూప్‌-1లో స్కామ్‌ జరిగింది: తెలంగాణ విఠల్‌

  • టీజీపీఎ్‌ససీ తీరుపై విద్యావంతుల ఫైర్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని.. మూల్యాంకనంలో పెద్దఎత్తున లోపాలున్నాయని కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. అసలు మూల్యాంకనం చేసిన వారికున్న విద్యార్హతలు ఏమిటని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ)ను నిలదీశారు. సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారని దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావంతులు, గ్రూప్‌-1 అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. గ్రూప్‌-2, 3లలో మాదిరిగా.. గ్రూపు-1 ఫలితాల్లో జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు(జీఆర్‌ఎల్‌)ను ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావునిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలోని బ్లూప్రింట్‌ను గూగుల్‌ ట్రాన్స్‌లేషన్‌ ద్వారా తెలుగులోకి తర్జుమాచేసి.. మూల్యాంకనం చేసేవారికి ఇచ్చారు. దీంతో.. తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది.


అందుకే 100 మంది గ్రూప్‌-1 టాపర్లలో తెలుగు మీడియం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉర్దూ మీడియంలో మెయిన్స్‌ రాసిన తొమ్మిది మంది అభ్యర్థుల్లో.. 450కి పైగా మార్కులు సాధించినవారు ఎంతమంది ఉన్నారని కమిషన్‌ను ప్రశ్నించారు. వారిలో ఒకరికి జనరల్‌ ఎస్సేలో అత్యధికంగా 97.5 మార్కులు వచ్చాయని, ఇదే టాప్‌ స్కోర్‌ అని తెలుస్తోందని, దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘‘‘పేపర్‌ మూల్యాంకనం రెండు విడతల్లో వేర్వేరుగా జరిగింది. తొలి విడతలో యూపీఎస్సీ ప్రమాణాలతో పేపర్లు దిద్దారు. చాలా మంది అభ్యర్థులకు 40ు మార్కులు కూడా రాలేదు. దీంతో.. రెండో విడత వాల్యుయేషన్‌లో ఉదారవాదాన్ని ప్రదర్శించారు’’ అని అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 మూల్యాంకనంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ.. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, విపక్ష నేత కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులకు రాసిన లేఖను మీడియా ముందు ప్రదర్శించారు.


కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు అశోక్‌ మాట్లాడుతూ.. 200కు పైగా గ్రూప్‌-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణ ఉద్యమ పేపర్‌లో విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంపై అనుమానాలున్నా యి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల అధ్యాపకులతో మూల్యాంకనం చేయడం వల్ల ఈ దారుణం జరిగింది. రీకౌంటింగ్‌ కాదు.. 20,100 సమాధాన పత్రాలను అర్హులతో రీ-వాల్యుయేషన్‌ చేయించాలి’’ అని డిమాండ్‌ చేశారు. వ్యాపమ్‌ కుంభకోణాన్ని మించి గ్రూప్‌-1 నిర్వహణలో స్కామ్‌ జరిగిందని తెలంగాణ విఠల్‌ తీవ్రంగా ఆరోపించారు. పలువురు గ్రూప్‌-1 అభ్యర్థులు ఈ సందర్భంగా తమ గోడు వెల్లబోసుకున్నారు. నిరుద్యోగుల ఉసురుతోనే బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్‌ విస్మరించొద్దన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 05:14 AM