Poster War: కామలీలల కవ్వంపల్లి.. రాసలీలల రసమయి!
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:39 AM
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది.
మానకొండూర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోస్టర్ వార్
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పోరు
కరీంనగర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచరుల మధ్య పరస్పర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ‘కామలీలల కవ్వంపల్లి’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు పెడితే.. ‘రాసలీలల రసమయి’ అంటూ కాంగ్రెస్ నేతలు ఓ పోస్టర్ విడుదల చేశారు. దీనికిపోటీగా బీఆర్‌ఎస్ నేతలు ‘కమీషన్ల నారాయణ’ అంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ వార్‌కు ఓ రోడ్డు నిర్మాణం అంశం కారణం కావడం గమనార్హం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు 21 కిలోమీటర్లు డబుల్ రోడ్డు నిర్మించాలని స్థానికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 2022-23లో గుండ్లపల్లి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో రసమయి బాలకిషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం డబుల్ రోడ్డును మంజూరు చేయగా.. గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు నిర్మాణం పూర్తయింది. తరువాత బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తాజాగా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ ఈ నెల 12న ధర్నా చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.