Engineering Colleges: బీటెక్‌లో మరో 8వేల సీట్లు పెరిగే అవకాశం
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:52 AM
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక విద్యాశాఖ కసరత్తు
హైదరాబాద్ సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని 90కి పైగా కాలేజీల్లో సుమా రు 8వేల సీట్ల పెంపునకు సాంకేతిక విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి మేరకు సీట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. కాలేజీల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని వర్సిటీలకు సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది కోర్ బ్రాంచ్‌లకు డిమాండ్ పెరగడంతో ఆ మేరకు సీట్లను పెంచుకునేందుకు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కో కాలేజీల్లో వసతుల స్థాయిని బట్టి గరిష్ఠంగా 120 సీట్ల మేర పెంచేందుకు అనుమతిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.