Ponnam Prabhakar: రాహుల్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:39 AM
రాహుల్‌గాంధీ ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు ఒప్పుకొని గెజిట్ విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్.. గాంధీభవన్‌లో రాహుల్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు ఒప్పుకొని గెజిట్ విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే తరానికి రాహుల్‌గాంధీ ఒక దిక్సూచి లాంటి వారని ఆయన కొనియాడారు. గాంధీభవన్‌లో గురువారం రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్‌గాంధీ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. భారీ కేక్‌ను కట్ చేసి.. బాణా సంచా కాల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించిందని చెప్పారు.
దేశ ప్రజల హితం కోసమే రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. నిజాయితీ, ధైర్యం, రాజ్యాంగ విలువలతో ముందడుగేస్తూ.. సామాన్యుల ఆకాంక్షలకు గొంతుకగా నిలుస్తోన్న ప్రజానాయకుడు రాహుల్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం.. ఆయనకు ఆరోగ్యం, ఆయుష్షు, మరిన్ని విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రజాభవన్‌లో కార్మికుల మధ్య రాహుల్ జన్మదిన వేడుకలు
రాహుల్ జన్మదిన వేడుకలు ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.