అధ్యక్షా.. నాకొక సూట్‌కేస్ కావాలి!
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:22 AM
‘మేం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయ్యాయి. మాపై బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి విమర్శలు గుప్పిస్తున్నాయి.. హామీలపై నిలదీస్తున్నాయి..

మోదీ రూ.15 లక్షలిస్తే తీసుకెళ్లేందుకు..
బీజేపీ నేతలు కేంద్రంతో కొట్లాడి.. నిధులు తేవాలి: పొన్నం
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘మేం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయ్యాయి. మాపై బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి విమర్శలు గుప్పిస్తున్నాయి.. హామీలపై నిలదీస్తున్నాయి.. అయితే పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింద’ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గంటలకుపైగా మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మధ్యలో జోక్యం చేసుకున్న పొన్నం.. ‘అధ్యక్షా.. నాకొక సూట్‌కేస్ కావాలి.
ప్రతీ పౌరుడికి రూ.15 లక్షల ఇస్తామని మోదీ 2014లో హామీ ఇచ్చారు. నా డబ్బులు మోదీ ఇస్తారేమో! ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పిస్తారేమో! డబ్బులు తీసుకునేందుకు సూట్‌కేస్ కావాలి’ అని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘ఇక్కడ మాట్లాడటం కాదు.. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మోటివేట్ చేయండి.. కేంద్రంతో కొట్లాడి.. మెట్రో, మూసీ, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులకు నిధులు తీసుకురండి’ అని బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ‘బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఏపీకి ఇస్తున్న నిధులు ఎంత... తెలంగాణకు ఇచ్చినదెంత లెక్క చెప్పాల’ని కోరారు