Ponguleti: పదవులు శాశ్వతం కాదు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:37 AM
పదవులు శాశ్వతం కాదని రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, నిర్ణయాలతో పది మందికి మేలు జరగాలన్నారు.
నిర్ణయాలతో పది మందికి మేలుచేయాలి
మంత్రి పొంగులేటి నర్మగర్భ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పదవులు శాశ్వతం కాదని రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, నిర్ణయాలతో పది మందికి మేలు జరగాలన్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్‌తో కలిసి శనివారం ఆయన ఉదోగ్య సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరం చేసిందన్నారు.
అందుకే ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేసేందుకు మళ్లీ గ్రామ పాలనాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పొంగులేటి చెప్పారు. గతంలో పని చేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించడానికి గత మార్చిలో పరీక్ష నిర్వహిస్తే 3,454 మంది అర్హత సాధించారని, రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు గతంలో పని చేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో విడుత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ట్రెసా, తెలంగాణ తహసీల్దార్‌ల సంఘం, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.