Share News

Ponguleti: ప్రగతి భవన్‌ కట్టారు.. పేదోళ్ల ఇళ్లు మరిచారు

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:39 AM

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో 2 వేల కోట్లతో ప్రగతి భవన్‌ నిర్మించుకొని విలాసవంతమైన జీవితం..

Ponguleti: ప్రగతి భవన్‌ కట్టారు.. పేదోళ్ల ఇళ్లు మరిచారు

  • హామీలు మరిచి, అప్పులు మిగిల్చిన కేసీఆర్‌:మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, మన్ననూర్‌/అచ్చంపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో 2 వేల కోట్లతో ప్రగతి భవన్‌ నిర్మించుకొని విలాసవంతమైన జీవితం గడిపారని, పేదలకు మాత్రం ఇళ్లు కట్టించడం మరిచిపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరులో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డిలతో కలిసి 536 మంది ఆదివాసీ చెంచు లబ్ధిదారులకు సోమవారం ఇందిరమ్మ గృహనిర్మాణ అనుమతి పత్రాలను అందజేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, రూ.8.19లక్షల కోట్ల అప్పులు చేసి ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు.


తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని, రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. అటవీ, రెవెన్యూ అధికారులు మానవీయ కోణంలో సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పొంగులేటి అన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని భూ సమస్యలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ హక్కులు కల్పించాలని భావించినా నిబంధనల పేరుతో అటవీ అధికారులు కొర్రీలు వేస్తున్నారని, దీనిపై అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Updated Date - Jul 08 , 2025 | 11:26 AM