Ponguleti: రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:12 AM
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కొత్తగూడెం, హైదరాబాద్ జూలై 6 (ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించామని, బఫర్ కింద మరో 1,500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో నియోజకవర్గానికి చెందిన 2,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పేదరిక నిర్మూలనే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే వాడుకుని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలోని 21 నియోజకవర్గాల్లో 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని మంత్రి పొంగులేటి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తొలి విడతలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి చెంచులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించ నున్నట్టు ఆయన పేర్కొన్నారు.