Police Rescue: పైన అట్టపెట్టెలు.. కింద గోవులు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:16 AM
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా వేర్వేరు ఘటనల్లో వాహనాల్లో తరలిస్తున్న 56 మూగజీవాలను పోలీసులు కాపాడారు. వీటిలో 31గోవులు, 25ఎద్దులు ఉన్నాయి.
డీసీఎంలో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
56 మూగజీవాలు గోశాలలకు తరలింపు
చౌటుప్పల్ రూరల్/ వలిగొండ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా వేర్వేరు ఘటనల్లో వాహనాల్లో తరలిస్తున్న 56 మూగజీవాలను పోలీసులు కాపాడారు. వీటిలో 31గోవులు, 25ఎద్దులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ బహదూర్‌పూర్ కబేళాకు డీసీఎంలో గోవులను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ డీసీఎం వాహనం పైభాగంలో అట్టపెట్టెలు, వాటి కింద తాళ్లతో కట్టేసిన మూగజీవాలను గుర్తించారు. మొత్తం 21ఎద్దులు, 12ఆవులను హైదరాబాద్‌లోని గోశాలకు తరలించారు. డీసీఎం డ్రైవర్ పెద్దపూడి అప్పల కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపారు.
మరొక ఘటనలో కోదాడ నుంచి హైదరాబాద్‌కు మినీ వాహనంలో 4 ఎద్దులు, 5గోవులను తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనలో భానోతు సురేందర్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు వలిగొండ మండల కేంద్రంలో 14 గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కంటైనర్ వాహనంలో హైదరాబాద్‌లోని తుక్కుగూడ కబేళాకు తరలిస్తుండగా పట్టుకుని అనకాపల్లి జిల్లాకు చెందిన జోగ శివాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగేంధర్ తెలిపారు.