Share News

Supreme Court: బంజారా, లంబాడా, సుగాలీలు గిరిజనులు కారు

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:11 AM

బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Supreme Court: బంజారా, లంబాడా, సుగాలీలు గిరిజనులు కారు

  • వారిని ఎస్టీల జాబితానుంచి తొలగించాలి

  • సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, మాజీ ఎంపీ సోయం బాపూరావుతోపాటు మరికొందరి తరఫున సీనియర్‌ న్యాయవాది అల్లంకి రమేశ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం - 1976 మేరకు ఆ మూడు వర్గాలను ఎస్టీలుగా గుర్తించడం ఆర్టికల్‌ 342ని ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. బంజారా, లంబాడాలు, సుగాలీలు గిరిజనులు కాదని, 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని వెల్లడించారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రా ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్‌ స్టేట్‌లో కాదని తెలిపారు. కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఒక కులానికి చెందిన వారు ఎస్టీలు, మరికొన్ని జిల్లాల్లో బీసీలుగా ఉండడం సరికాదని ఆ మూడు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారని పిటిషన్‌లో వెల్లడించారు.


ఇప్పుడు మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయని , తెలంగాణలోని బంజారా, లంబాడా, సుగాలీలను బీసీ సామాజిక వర్గంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ జె.కె. మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Aug 30 , 2025 | 01:11 AM