Share News

Telangana 2047 Vision: తలసరి ఆదాయం టార్గెట్‌ రూ.24 లక్షలు!

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:38 AM

మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్‌ డాక్యుమెంట్‌ను రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది.......

Telangana 2047 Vision: తలసరి ఆదాయం టార్గెట్‌ రూ.24 లక్షలు!

మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్‌ డాక్యుమెంట్‌ను రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రధాన నగరాన్ని అటు ఐటీ రంగం కోసం, ఇటు నైట్‌ లైఫ్‌ ఆధారిత టూరిజం కోసం ప్రత్యేకించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాన్ని కాలుష్య రహిత పరిశ్రమల కోసం, ఫ్యూచర్‌ సిటీ కోసం నిర్దేశించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ బయటి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధార తెలంగాణగా తీర్చిదిద్దనుంది. రాష్ట్రం సరిహద్దుల్లోని ఏ పట్టణం నుంచయినా కేవలం రెండు గంటల్లో హైదరాబాద్‌ చేరుకొనే విధంగా తెలంగాణ అంతటా లక్షన్నర కిలోమీటర్ల రోడ్‌నెట్వర్క్‌ సిద్ధం చేస్తున్నారు.

2047 కల్లా సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం..

ప్రస్తుత రూ.4.30 లక్షల నుంచి 6.2 రెట్లు పెరగాలి

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్లో ప్రస్తావన

మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి

భారత జీడీపీలో 10 శాతం వాటా మనదే కావాలి

3 ప్రాంతాలుగా విభజించి తెలంగాణ అభివృద్ధి

లక్షన్నర కిలోమీటర్ల రోడ్లు... మరో 2 రింగ్‌రోడ్లు

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 30లక్షల మంది జనాభా

ఉద్యోగం, అధ్యయనం, వినోదం, నివాసం అక్కడే

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తలసరి ఆదాయం 2047 నాటికి రూ.24 లక్షలకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4.30 లక్షలుగా ఉన్న తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయాన్ని రెండు దశాబ్దాల్లో ఆరు రెట్లకు పెంచాలన్న బృహత్తర లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకుంది. ఫ్యూచర్‌ సిటీ రాష్ట్రానికే కాకుండా దేశానికి భవిష్యత్తును చూపించే నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. రెండు దశాబ్దాల్లో 30 లక్షల మంది జనాభా ఆ నగరాన్ని ఆవాసంగా చేసుకుంటారని అంచనా వేస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మూడు జోన్‌లుగా విభజించి, అక్కడి పరిస్థితులకు అనువైన పెట్టుబడులను ఆకర్షించి శరవేగంతో అభివృద్ది సాధించాలని లక్ష్యాలు నిర్దేశించుకుంది. రాష్ట్ర ప్రజల్లో 90 శాతం మంది ఇంట్లో బయలుదేరిన రెండు గంటల్లో హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డును టచ్‌ చేసే విధంగా రాష్ట్రమంతటా విశాలమైన రోడ్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఇప్పుడున్న రోడ్‌ నెట్‌వర్క్‌కు మరో 150 శాతం కొత్త రోడ్లను జోడిస్తారు. ఐటీ, ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీల్లో ముందంజ వేయడమే కాకుండా ముందెన్నడూ లేనన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పౌరుడికి ఉత్తమ వైద్యం, అత్యుత్తమ విద్య, స్వచ్ఛమైన వాతావరణం, భద్రత, ఉపాధి అవకాశాలు, ఆధునిక నైపుణ్యాలు అందించేలా ప్రణాళికలు... తెలంగాణ రైజింగ్‌-2047 దార్శనిక పత్రంలోని ముఖ్య అంశాలివే. అందులో లక్ష్యాలు, వాటిని సాధించుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించారు. 4 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుని ఈ దార్శనిక పత్రాన్ని తీర్చిదిద్దారు. లక్ష్యాలే కాకుండా వాటిని సాధించే మార్గాలను కూడా పొందుపరిచారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’లో ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. మొత్తం ఎనిమిది రంగాలను-ఎనిమిది ధీమ్‌లుగా చేసుకుని డాక్యుమెంట్‌ను రూపొందించారు.


7.jpg

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ

భారత్‌ ఫ్యూచర్‌ సిటీని 13,500 ఎకరాల్లో నిర్మిస్తారు. నివాసం, పని, అధ్యయనం, వినోదం అన్నీ ఒకే చోట డిజైన్‌ చేస్తారు. తొలి నెట్‌జీరో కార్బన్‌ నగరం. కార్యాలయాలకు 15 నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్లొచ్చు. ప్రధాన వాణిజ్య కేంద్రం చుట్టూ ఏఐ సిటీ, హెల్త్‌ సిటీ, ఎడ్యుకేషన్‌ హబ్‌, వినోద కేంద్రాలు వస్తాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 25 నుంచి 30 లక్షల మంది జనాభా నివాసం ఉండేలా తీర్చిదిద్దుతారు. వినోదం కోసం వందల ఎకరాల్లో క్రికెట్‌ స్టేడియం, గోల్ఫ్‌ కోర్స్‌, థీమ్‌ పార్కులు, రిసార్టులు వస్తాయి.

వ్యవసాయానికి ఊతం వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఆధునిక పరిశోధనకోసం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏఐ కేంద్రాలు అభివృద్ధి చేస్తారు. తెలంగాణ అగ్రిటెక్‌ రీసెర్చ్‌- సర్టిఫికేషన్‌ సెంటర్‌(టీఏఆర్‌సీసీ)ను ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేస్తారు. నానో ఇన్‌పుట్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎన్‌ఐఆర్‌సీ), తెలంగాణ అగ్రికల్చర్‌ బయో ఇన్‌ఫర్మాటిక్‌ గ్రిడ్‌(టీఏజీ) పెడతారు. మొబైల్‌ మృత్తిక పరీక్ష నెట్‌వర్క్‌, సామాజిక మృత్తిక మిషన్‌ ఏర్పాటు చేస్తారు. హెక్టారుకు వ్యవసాయ విద్యుత్‌ శక్తిని 3.5 కిలోవాట్ల నుంచి 9 కిలోవాట్లకు పెంచుతారు. 40 లక్షల ఎకరాలకు స్మార్ట్‌గా సాగునీరు అందిస్తారు. ఎప్పుడు, ఎంత తడి అవసరం అనేది సాంకేతికత ద్వారా గ్రహించి అందేలా చూస్తారు. దీనికోసం డిజిటల్‌ వాటర్‌ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. పామాయుల్‌ విస్తీర్ణం 11.83 లక్షల ఎకరాలకు పెంచుతారు. 11 సీడ్‌ హబ్‌లు, సీడ్‌ కౌన్సిల్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. 25 లక్షల ఎకరాలకు మద్దతుగా 500 అగ్రిటెక్‌ క్లస్టర్లు, 3.50 లక్షల టన్నుల గిడ్డంగి సామర్థ్యం, కోల్డ్‌ స్టోరేజీ విస్తరణ కూడా ప్రాధాన్యం ఇచ్చారు.

1.jpg

3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

ప్రజల జీవన ప్రమాణాలకు ఒక ప్రధాన సూచిక తలసరి ఆదాయం. ఈ విషయంలో ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండు దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి వెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం 5,100 డాలర్లు. 2046-47 నాటికి పెట్టుకున్న లక్ష్యం 28,800 డాలర్లు. రూ.4.30 లక్షల నుంచి రూ.24 లక్షలకు... అంటే దాదాపు 6.2 రెట్లు పెంచాలన్నది ఉద్దేశం. స్థూల రాష్ట్రోత్పత్తిని(జీఎ్‌సడీపీ)ని 3 ట్రిలియన్‌ డాలర్లకు పెంచాలన్నది మరో లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తిలో అది పది శాతంగా ఉండాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎ్‌సడీజీ) ఆధారంగా దీన్ని సాధిస్తారు. అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల రేటును 52 శాతం పెంచుతారు. వినూత్న ఆవిష్కరణల ద్వారా పరిశ్రమల ఉత్పాదకతను భారీగా పెంచుతూ వలస వెళ్లిన తెలంగాణ నిపుణులను వెనక్కి రప్పిస్తారు. డీప్‌టెక్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటం, సైబర్‌ సెక్యూరిటీ, జీన్‌టెక్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు.


4.jpg

ఇప్పటికే లక్ష కోట్ల పెట్టుబడులు

తెలంగాణను తయారీ రంగం, నాలెడ్జ్‌-బేస్డ్‌ పెట్టుబడుల గమ్యస్థానంగా మలుస్తారు. అధునాతన తయారీ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ప్రతిభను ఆకర్షించడం, జీవన ప్రమాణాలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, అత్యాధునిక ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు, శక్తివంతమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యం. ప్రగతిశీల విధానాలతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షిస్తారు. ఇప్పటికే 14 సంస్థలు రూ.లక్ష కోట్లపెట్టుబడికి సిద్ధమయ్యాయి. మరో 35 సంస్థలు ప్రభుత్వంలో చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చాయి. మరో లక్షకోట్లు రావొచ్చని అంచనా.

5.jpg

నగరం ఇక నిద్రపోదు

రాత్రి ఉత్సవాలతో మరో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. నైట్‌ బజార్లు, ఫుడ్‌ కోర్టులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగం. మూసీకి అటూ ఇటూ సాంస్కృతిక పునరుజ్జీవనం చేస్తారు. పర్యాటక రంగంలోనే 50 వేల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్నారు. రాత్రివేళ పనిచేసే లక్షల మంది ఐటి, అనుబంధ నిపుణులకు అవసరమైన సౌకర్యాలను విస్తరిస్తారు. దక్షిణాసియా రాత్రి జీవిత రాజధానిగా హైదరాబాద్‌ను మలుస్తారు. 24 గంటలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరిగే పరిస్థితి కల్పిస్తారు. పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇందులో భాగం పంచుకుంటాయి. మెట్రో, ఆర్టీసీ, హెచ్‌ఎండీఎ, రవాణా శాఖల సమన్వయంతో రవాణాను నిర్వహిసారు.

6.jpg

3 పారిశ్రామిక కారిడార్లు

మూడు ప్రధాన జాతీయ రహదారులను పారిశ్రామిక కారిడార్లుగా తీర్చిదిద్దుతారు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌, హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్‌, హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌లకు అటూ ఇటూ స్మార్ట్‌ పారిశ్రామిక నగరాలు, మెగాపార్కులు, సెమీకండక్టర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎరోస్పేస్‌, రక్షణ పెట్టుబడులను ఆకర్షిస్తారు. ఫార్మా రంగంలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా హబ్‌లు, క్లీనికల్‌ రీసెర్చ్‌లను ఏర్పాటు చేస్తారు.

మన బ్రాండ్‌ మాంసం

పరిశుభ్రమైన మాంసం ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం 100 మాంసం హబ్‌లు ఏర్పాటు చేస్తారు. టీ-ఎగ్‌, టీ-మీట్‌ పేరుతో తెలంగాణ పౌలీ్ట్రకి బ్రాండింగ్‌ కల్పిస్తారు. 42.86 లక్షల మంది మహిళలకు దేశీ కోడీ స్టార్టర్‌ కిట్లు ఇస్తారు. మహిళల ఆధ్వర్యంలో 259 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 5 రెట్లు వృద్ధి సాధిస్తారు. 22 లక్షల టన్నులకు పెంచుతారు. 23.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు.


2.jpg

నెట్‌ జీరో లక్ష్యం:

తెలంగాణను నెట్‌-జీరో కాలుష్య రాష్ట్రంగా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • పునరుత్పాదక శక్తిపై భారీ పెట్టుబడులు

  • హరిత మౌలిక వసతులు

  • వనరుల పరిమిత వినియోగం, పునర్వినియోగం

  • ప్రకృతి ఆధారిత పరిష్కారాలు

  • పరిశ్రమల్లో కార్బన్‌ తగ్గిస్తే ప్రోత్సాహకాలు

విజయానికి 3 పునాది స్తంభాలు

  • టెక్నాలజీ వినూత్న ఆవిష్కరణలు

  • సమర్థ ఆర్థిక విధానం

  • సుపరిపాలన

ప్రధాన ఆశయాలు

  • మెరుగైన విద్య.. ఫ ఉత్తమ వైద్యం

  • పారిశుద్ధ్యం.. ఫ స్వచ్ఛమైన వాతావరణం

  • భద్రత.. ఫ ఇంటి దగ్గరే అవకాశాలు

  • భవిష్యత్తుకు అనుగుణంగా ఐటీ, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

  • ఆధునిక నైపుణ్యాలు


యువత...రైతులు

యువతకు మంచి విద్యతో పాటు భవిష్యత్తు నైపుణ్యాలను అందిస్తారు. మూడు ఆర్థిక మండలాలకు తగిన నైపుణ్యాలను వారిలో అభివృద్ధి చేస్తారు. గ్లోబల్‌ ఇండస్ర్టీ భాగస్వామ్యాల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టిస్తారు. పంట వైవిధ్యం, అగ్రిటెక్‌ వాడకం, విలువ వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తారు. లాజిస్టిక్స్‌, ఎఫ్‌పీఓలు, సాగునీరు, రియల్‌-టైమ్‌ సలహాలపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పరిగణిస్తారు. ప్రాథమిక వైద్యం, వ్యాధి నిరోధక విధానాలను బలోపేతం చేస్తారు. వృద్థులు, దీర్ఘకాలిక రోగాల నిర్వహణ, చౌక ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమంపై దృష్టిసారిస్తారు.

లక్షన్నర కిలోమీటర్లు... మరో 2 రింగ్‌ రోడ్లు

ఇరవయ్యేళ్లలో రాష్ట్ర రోడ్‌ నెట్‌వర్క్‌ను 150 శాతం వృద్ధి చేస్తారు. ఇప్పుడు 34,058 కిలోమీటర్ల రోడ్లు ఉండగా వీటిని 53,102 కిలోమీటర్లకు పెంచుతారు. వరుసలను కూడా లెక్కలో తీసుకుంటే ప్రస్తుతం ఉన్న రోడ్లు 46 వేల కిలోమీటర్లు. లక్షన్నర కిలోమీటర్లకు పెంచుతారు. జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ 4983 కిలోమీటర్ల నుంచి 7,482 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారుల్ని 1,687 కిలోమీటర్ల నుంచి 8,600 కిలోమీటర్లకు పెంచుతారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుబంధంగా మరో రెండు రింగ్‌ రోడ్లను ప్రతిపాదించారు. ఒకటి 1150 కిలోమీటర్లతో సరిహద్దులకు ఆనుకున్న పట్టణ ప్రాంతాలను అనుసంధానిస్తారు. ప్రజా వలయం పేరుతో 770 కిలోమీటర్లతో గ్రామీణ తెలంగాణను అనుసంధానిస్తారు. ఈ నెట్‌వర్క్‌తో పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే 90 శాతం మంది ప్రజలు రెండు గంటల వ్యవధిలోఓఆర్‌ఆర్‌ను చేరుకుంటారు.


3 ప్రాంతీయ అభివృద్ధి మండలాలు

రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ అభివృద్ధి మండలాలుగా వర్గీకరించారు. అక్కడి అవకాశాలను బట్టి అభివృద్ది లక్ష్యాలను నిర్దేశించారు.

ఎ) గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతం. 2,053 చదరపు కిలోమీటర్లు. టెక్నాలజీ, పెట్టుబడులకు గ్లోబల్‌ హబ్‌. దీన్ని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) అని పిస్తున్నారు.

  • టెక్నాలజీ, డీప్‌టెక్‌, ఏఐ, ఇండస్ట్రీ 4.0, మాన్యుఫాక్చరింగ్‌

  • గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్స్‌(జీసీసీ)

  • డిజైన్‌ స్టూడియోలు, ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్స్‌

  • స్టార్ట్‌పలు, నాలెడ్జ్‌ ఎకానమీ ప్రధాన కేంద్రం

  • గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా అభివృద్ధి

బి) ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతం. 9,281 చ దరపు కిలోమీటర్లు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఇందులోనే. పెరి అర్బన్‌ రీజియన్‌(ప్యూర్‌)గా పిలుస్తారు. పారిశ్రామిక వాడలు, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, నెట్‌జీరో టౌన్‌షి్‌పల నిర్మాణం చేపడతారు.

  • మధ్యస్థాయి అండ్‌ క్లస్టర్‌ ఆధారిత పరిశ్రమలు

  • పర్యావరణ ప్రమాణాలతో ఆరెంజ్‌, ఎల్లో వర్గ పరిశ్రమలు

  • ఎకో ఇండస్ట్రియల్‌ పార్కులు

  • నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు

  • గ్రామీణ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు అనుసంధానించడం

సి) ఆర్‌ఆర్‌ఆర్‌ బయట.. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ(రేర్‌)గా పిలుస్తారు. మిగిలిన 9,400 గ్రామాలు, 108 పట్టణ ప్రాంతాలు కలిపి 1,00,743 చదరపు కిలోమీటర్లు. వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు, చేనేత, సాంస్కృతిక రంగాలు, పర్యాటకానికి పెద్దపీట వేస్తారు.

గ్రామీణ జీవనోపాధులు, ప్రకృతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తారు.

  • టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం(ఏఐ, ఐఓటీ, ఫార్మింగ్‌)

  • పశు సంవర్థకం, పాలు, చేపల పెంపకం బలోపేతం

  • అటవీ ఆధారిత జీవనోపాధులు, గిరిజన తెగలకు బాసట

  • ఎకో-టూరిజం క్లస్టర్లు

  • డిజిటల్‌ వ్యవసాయం, లాజిస్టిక్స్‌, ఎఫ్‌పీఓ నెట్‌వర్క్‌లు

Updated Date - Dec 05 , 2025 | 02:38 AM