Pashamylaram Factory Incident: సిగాచి ప్రమాదంలో ప్రేమికుల మృతి.. విషాదంలో ఎమ్మెల్యే..
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:36 PM
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రేమ జంట కన్నుమూసింది. పెళ్లి పీటలు ఎక్కకు ముందే ఆ ప్రేమ జంట అనంత లోకాలకు వెళ్ళడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇద్దరిది వేర్వేరు ప్రాంతం. ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఎమ్మెస్సీ చదవిన వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్తా ప్రేమగా మారింది. వివాహం ద్వారా ఒక్కటవుదామనుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబంలోని పెద్దలకు చెప్పారు. కులాలు వేరు. ఈ వివాహం వద్దన్నారు. కానీ వీరిద్దరు మాత్రం వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును ఈ ప్రేమ జంట ఆశ్రయించింది. ఆయన ఇరు కుటుంబాలతో సంప్రదింపులు జరిపి.. వీరి వివాహానికి వారిని ఒప్పించారు. దీంతో ఆషాఢం వెళ్లిన వెంటనే శ్రావణ మాసంలో వీరి వివాహానికి పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. కానీ పెద్దలు ఒకటి తలిస్తే పైన ఉన్నవాడు మరొకటి తలచినట్లు అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Pashamylaram Factory Lovers Incident: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం సంభవించిన పేలుడులో 36 మంది ప్రాణాలు కొల్పోగా.. 17 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ విషాద ఘటనలో ఓ ప్రేమ జంట కలలు కలలుగానే మిగిలిపోయాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట మృత్యువు ఒడికి చేరుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే..
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేసి.. సిగాచి పరిశ్రమలో ఉద్యోగంలో చేరాడు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు సమీపంలోని పుట్రేలకు చెందిన శ్రీ రమ్య సైతం ఎమ్మెస్సీ పూర్తి చేసి అదే సంస్థలో ఉద్యోగంలో చేరారు. వీరిద్దరి మధ్య స్నేహం ప్రారంభమై.. అది ప్రేమగా చిగురించింది. దీంతో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ కులాలు వేరు కావడంతో.. వీరి పెళ్లిని వారు నిరాకరించారు. దీంతో తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును ఈ ప్రేమ జంట ఆశ్రయించింది. ఆయన మధ్యవర్తిత్వంతో ఈ ఇరు కుటుంబాలతో ఆయన మాట్లాడారు. దాంతో వీరి వివాహానికి ఈ రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో శ్రావణ మాసంలో వీరి వివాహం జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తం సైతం నిర్ణయించారు.
ఆ క్రమంలో ఆ ప్రేమ జంట.. ఇటీవల హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కొలికపూడి నివాసానికి వెళ్లింది. తమ వివాహానికి రావాలంటూ ఆయనకు ఆహ్వానించారు. మరికొద్ది రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు ఆయన నూతన వస్త్రాలు పెట్టి పంపించారు. అయితే తాము ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లు అయింది. పాశమైలారంలోని పరిశ్రమలో సోమవారం పేలుడు వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి.. నిఖిల్ రెడ్డికి ఫోన్ చేశారు. అలాగే రమ్యకు సైతం ఫోన్ చేశారు. ఇరువురు నుంచి స్పందన రాలేదు. దాంతో ఆయన హుటాహుటిన సిగాచీ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.
మొదటి అంతస్తులో విధులు నిర్వహిస్తున్న రమ్య.. భవనం కూలిపోవడంతో స్లాబ్ కింద పడి మరణించింది. అలాగే నిఖిల్ రెడ్డి పూర్తిగా కాలిపోయాడని అధికారులు వెల్లడించారు. దీంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. విషాదంలో మునిగిపోయిన రెండు కుటుంబాలను ఎమ్మెల్యే ఓదార్చారు.
Also Read:
పాశమైలారం ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం: సీఎం రేవంత్ రెడ్డి
ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
For More Telangana News