Share News

Jubilee Hills By Election: ఓటర్లకు రూ.100 కోట్లు!

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:18 AM

అటు అధికార కాంగ్రెస్‌, ఇటు విపక్ష బీఆర్‌ఎస్‌ రెండూ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నువ్వా? నేనా? అన్నట్లుగా హోరాహోరీగా సాగుతోంది......

Jubilee Hills By Election: ఓటర్లకు రూ.100 కోట్లు!

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ వ్యయం

  • ఖర్చుకు వెనుకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు.. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలం

  • 2 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా నగదు పంపిణీ.. ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాటు

  • తమకు డబ్బులు అందలేదంటూ కొందరి నిరీక్షణ.. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్లి ఆరా

  • కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బులో కోత విధింపు.. స్థానిక నాయకుల పనేనన్న అనుమానాలు

  • లక్ష పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ.. ఇప్పటివరకు 50 వేల చీరల పంపిణీ?

ఆంధ్రజ్యోతి - హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి: అటు అధికార కాంగ్రెస్‌, ఇటు విపక్ష బీఆర్‌ఎస్‌ రెండూ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నువ్వా? నేనా? అన్నట్లుగా హోరాహోరీగా సాగుతోంది. దీంతో ఖర్చు పరంగానూ ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌ మహానగరంలో ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఒకటిరెండు సందర్భాల్లో మినహాయిస్తే.. హైదరాబాద్‌ నగర శివారులో ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలోనే రూ.100 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.

కోర్‌ ఏరియాలోని 15 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయం మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ, ఈసారి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదు. ప్రచారం మొదలైనప్పటికి ప్రస్తుతం జరుగుతున్న ఖర్చుకు ఏమాత్రం పొంతన లేకుండాపోయిందని ప్రధాన పార్టీలు నేతలు అంటున్నారు. ఒక పార్టీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 70 శాతం మందికి నగదు పంపించగా, మరో పార్టీ అభ్యర్థి 50 శాతం మందికే పంపించినట్లు తెలిసింది. పార్టీకి చెందిన స్థానిక నేతల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బులను చేరవేస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్ల లెక్క చూసుకుని పంపిణీ చేపట్టారు.

బలహీనంగా ఉంటే డబుల్‌..

ఒక పార్టీ మొదట్లో ఓటుకు రూ.3 వేలు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. ఓటుకు రూ.2500 చొప్పున ఇచ్చారు. మరో పార్టీ మాత్రం ఓటుకు రూ.1500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో ఓటుకు రూ.2500 చొప్పున పంపిణీ చేస్తున్న పార్టీ.. తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా రూ.5వేలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఓటుకు రూ.1500 చొప్పున పంపిణీ చేస్తున్న పార్టీ తాను బలంగా ఉన్నచోట మాత్రం రూ.వెయ్యి మాత్రమే పంపిణీ చేయటం గమనార్హం. అయితే ఓటర్లకు పంచే నోట్ల లెక్కల విషయంలో ప్రధాన పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక నేతలతో ఇ తర ప్రాంతాలకు చెందిన వారిని జతచేసి.. తమ మనుషుల ద్వారా డబ్బు పంపిణీ జరిగేలా చూసుకుంటున్నారు. స్థానికంగా తమకు సహకరించే వారికి రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఇవ్వటంతో పాటు.. మొత్తం ఎన్నిక పూర్తయ్యే నాటికి కొంత మొత్తా న్ని అదనంగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.


మహిళల చేతికే డబ్బులు..

ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఆ నగదును మహిళల చేతికే ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను అడిగి.. సదరు ఇంటి మహిళ చేతిలో డబ్బులు పెడుతున్నారు. పురుషులకు ఇస్తే వారు ఆ డబ్బుల్ని మద్యానికి ఖర్చు చేసే అవకాశం ఉందని, అదే మహిళల చేతికి ఇస్తే.. తమ నోట్లు ఓట్లుగా మారతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు పది రోజల క్రితమే రూ.500 చొప్పున ఒక పార్టీ పెద్ద ఎత్తున పంపిణీ చేసింది. ఓటుకు ఇచ్చే మొత్తానికి ఇది అదనంగా చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. నోట్లతోపాటు ఆడబిడ్డలకు కానుకగా వారి మనసుల్ని దోచుకునే బహుమతుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఓ పార్టీ లక్ష పట్టుచీరలు తెప్పించినట్లు తెలిసింది. ఇప్పటివరకు 50 వేల పట్టుచీరలు పంచినట్లు, మరో 50 వేలు పంచాల్సి ఉన్నట్లు సమాచారం.

2 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా..

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లుండగా.. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సరాసరి పోలింగ్‌ 47 శాతం నుంచి 52 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికలో పోలింగ్‌ అదే లెక్కన సాగినా 2 లక్షల ఓట్లకు పైనే పోల్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఓటర్లలో 2 లక్షల మందికి తాయిలాలు అందేలా ప్రధాన పార్టీలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ఒక పార్టీ రూ.50 కోట్లను ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇంత భారీగా నోట్ల పంపిణీ ద్వారా ఓటర్ల మనసు గెలుచుకోవటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేము పంపిణీ చేసిన ఓటర్లలో 50 శాతం మంది ఓట్లు వేసినా.. గెలుపు పక్కా. డబ్బులు ఇవ్వకున్నా పార్టీపై, అభ్యర్థిపై అభిమానంతో ఓట్లు వేస్తారు. అది అదనం అవుతుంది. గెలుపు సులువవుతుంది’’ అంటూ ఒక పార్టీ ఇప్పటివరకు లక్షన్నర మందికి ఓటర్లకు తాము ఇవ్వాల్సింది ఇచ్చేసినట్లుగా చెబుతుంటే.. మరో పార్టీ మాత్రం ఆదివారం సాయంత్రానికి లక్ష మంది ఓటర్లకు మాత్రమే డబ్బు పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలింగ్‌ పూర్తయ్యే నాటికి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఎన్నికల పంపిణీ ఖర్చు రూ.100 కోట్లు దాటిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పార్టీల అధినాయకత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అభ్యర్థుల మధ్య పోటీగా ఉన్న ఉప ఎన్నిక.. ఆ తరువాతి పరిణామాలతో ప్రధాన పార్టీల నాయకత్వాల ప్రతిష్ఠకు సవాలుగా మారింది.


మాకు డబ్బులు అందలేదు!

ప్రధాన పార్టీలు పంచుతున్న డబ్బులు తమకు అందలేదంటూ కొంతమంది ఓటర్లు చెబుతున్నారు. డబ్బులిచ్చే వారికోసం ఇళ్ల వద్ద పడిగాపులు కాశారు. ఇంటి వద్దకు పార్టీ ల నాయకులెవరైనా వస్తారేమోనని, డబ్బులిస్తారేమోనని ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల తరబడి నిరీక్షించారు. ఓటరు జాబితా కాగితాలు పట్టుకుని నలుగైదుగురు కలిసి కనిపించారంటే.. వారి వద్దకు వెళ్లి డబ్బుల గురించే అడగడం కనిపించింది. వాస్తవానికి పలు ప్రాంతాల్లో ఒక్కో ఓటరుకు ఆయా పార్టీల అధిష్ఠానం ఒక ‘ఫిగర్‌’ను నిర్ణయించింది. ఆ మేరకు బూత్‌ల వారీగా నగదు కేటాయింపులు చేశారు. అయితే ఓటరు జాబితా ప్రకారం తమకు నమ్మకం కలిగిన ఓటర్లకు డబ్బులు ఇవ్వాలని ముఖ్యనాయకులు భావించినప్పటికీ.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అందులో కోత విధించిన పరిస్థితి కనిపించింది. అభ్యర్థులు సరిగానే పంపించినప్పటికీ.. కిందిస్థాయి నేతలే కోత విధించారని పలువురు చెప్పుకొచ్చారు. పైగా, ఒక్కో అభ్యర్థి నియోజకవర్గంలోని సుమారు 1.20లక్షల మంది ఓటర్లకు లెక్కగట్టి డబ్బులు పంపినా.. స్థానిక నేతలు అందులో 80ు మందికే పంచుతున్నట్లు తెలిసింది. దీంతో ఇచ్చిన మొత్తాన్ని సరిగా పంపిణీ చేయకపోతే కొంప మునిగే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

6 ఓట్లకు రూ.33 వేలు!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ఓటర్లకు పంచుతున్న డబ్బు.. ఆయా కుటుంబాలకు జాక్‌పాట్‌లాగే మారింది. నియోజకవర్గంలోని బోరబండలో ఆరు ఓట్లు కలిగిన ఓ కుటుంబానికి మూడు ప్రధాన పార్టీలు కలిసి ఏకంగా రూ.33 వేలు ఇవ్వడం గమనార్హం. ఓ పార్టీ ఒక్కో ఓటుకు రూ.2500 చొప్పున ఆరు ఓట్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వగా, మరో పార్టీ ఓటుకు రూ.2 వేల చొప్పున రూ.12 వేలు, ఇంకో పార్టీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున రూ.6 వేలు ఇచ్చాయి. ఇలా అన్ని కుటుంబాలకూ ఇదే నిష్పత్తిలో డబ్బులు అందుతున్నాయి. అయితే ఓటర్లు కూడా తమ ఓట్లను ఈ నిష్పత్తి ప్రకారం అందరికీ పంచుతామని అంటున్నారు. ఒక పార్టీకి మూడు ఓట్లు, మరో పార్టీకి రెండు ఓట్లు, ఇంకో పార్టీకి ఒక ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

Updated Date - Nov 10 , 2025 | 08:04 AM