Panchayats Struggle as Central Funds: సమస్యల సుడిగుండంలో పంచాయతీలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:10 AM
నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమస్యల సుడిగుండంలో
పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణకూ ఇక్కట్లే
15 నెలలుగా కేంద్రం నుంచి రూ.2700 కోట్లకు బ్రేక్
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థికసంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎస్‌ఎ్‌ఫసీ(రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు అందకపోవడంతో గ్రామా ల్లో చిన్న చిన్న పనులూ చేపట్టలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటివి చేపట్టడానికి వీల్లేకుండా పో తోంది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు సైతం చెల్లించలేకపోతున్నామని పం చాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం.. వ్యాధులు ముసిరే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి.. 18 నెలలు అయింది. 2024 ఫిబ్రవరిలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉన్నా.. ఏదో ఓ కారణంతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పాలక వర్గాలు లేని కారణంగా పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,848 పంచాయతీలకు 15వ ఆర్థిక సం ఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180కోట్లు రావాల్సి ఉండగా.. 15నెలలకు సంబంఽధించి రూ.2,700కోట్లు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి.. పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఎ్‌ఫసీ నిధులు సైతం 13నెలలుగా విడుదల కావడంలేదు. మొత్తం రూ.1560కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో గ్రా మాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పంచాయతీలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. నిధులు ఆగిపోవడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఏ మాత్రం ఆదాయ వనరుల్లేని 6,000పైగా చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నిధుల లేమి, గ్రామాల అభివృద్ధి కుటుంబడిపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తొందరగా తేల్చి.. స్థానిక ఎన్నికలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.