Share News

Hyderabad: మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు..

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:12 AM

హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న ఓ పాకిస్థానీ యువకుడు తొమ్మిదేళ్ల క్రితం తనను ప్రేమ పేరుతో మోసం చేసి మతం మార్పించి పెళ్లి చేసుకొని, ఇప్పుడు మరో యువతిని వలలోకి దించి సహజీవనం చేస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది

Hyderabad: మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు..

ఇప్పుడు మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు

  • తనకు న్యాయం చేయాలని ఓ మహిళ డిమాండ్‌

  • అతడు పాకిస్థానీయుడని ఆమె ఆరోపణ

  • హైదరాబాద్‌ పోలీసుల అదుపులో నిందితుడు

బంజారాహిల్స్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న ఓ పాకిస్థానీ యువకుడు తొమ్మిదేళ్ల క్రితం తనను ప్రేమ పేరుతో మోసం చేసి మతం మార్పించి పెళ్లి చేసుకొని, ఇప్పుడు మరో యువతిని వలలోకి దించి సహజీవనం చేస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ యువకుడు ప్రియురాలితో ఉండగా బీజేపీ నాయకులతో కలిసి అతణ్ని పట్టుకొని నిలదీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను సముదాయించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ, తప్పుడు ధ్రువపత్రాలతో అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఫహాద్‌ అఖిల్‌ 2016లో తనను ప్రేమ పేరుతో నమ్మించి బలవంతంగా మతం మార్పించి వివాహం చేసుకున్నాడని తెలిపింది. తమకు ఓ కుమారుడు కూడా జన్మించాడని చెప్పింది. ఇప్పుడు అతను మరో యువతిని ప్రేమపేరుతో నమ్మించి సహజీవనం చేస్తున్నాడని తెలిపింది.


అతను తప్పుడు ధ్రువపత్రాలతో భారత్‌లో ఉంటున్నాడని, ఈ విషయమై ఢిల్లిలో ఇంటిలిజెన్స్‌ బ్యూరోకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆమె వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి తల్లి భారతీయురాలు కాగా, తండ్రి పాకిస్థానీగా తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌ్‌సకు చెందిన నిందితుడి తల్లి 1990లో సౌదీ అరేబియాకు వెళ్లిందని, అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి అతణ్ని పెళ్లి చేసుకుందని తెలిపారు. వివాహం అనంతరం భర్తతో కలిసి పాకిస్థాన్‌లోనే కాపురం పెట్టిందని, అక్కడ వారికి ఫహాద్‌ అఖిల్‌ జన్మించాడని చెప్పారు. కొద్దిరోజులకు భర్త చనిపోవడంతో పాకిస్థాన్‌లో ఉండలేక 1998లో ఆమె భారత్‌కు తిరిగొచ్చి లంగర్‌హౌ్‌సలో ఉంటోందని తెలిపారు. ఆమెకు ఇంకా పాకిస్థాన్‌ పౌరసత్వమే ఉందని చెప్పారు. ఫహాద్‌ ఆఖిల్‌కు కూడా భారతదేశ పౌరసత్వం లేదని, దాని కోసం అతడు దరఖాస్తు చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు

Updated Date - Aug 16 , 2025 | 04:12 AM