HIV: హెచ్‌ఐవీ రోగుల్లో మహిళలే ఎక్కువ
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:22 AM
హెచ్‌ఐవీ బాధితుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల మంది ఉన్నారు. కేసుల పరంగా తెలంగాణ ఐదో స్థానంలో.. ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని హెచ్‌ఐవీ బాధితులు, చికిత్స పొందుతున్న రోగుల గణాంకాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల రోగుల్లో మహిళలు 1.93 లక్షల మంది!
హెచ్‌ఐవీ కేసులు దక్షిణాదిలోనే అధికం 56 శాతం రోగులు ఐదు రాష్ట్రాల్లోనే
తెలంగాణలో 1.31 లక్షల మంది రోగులు ఐదో స్థానంలో రాష్ట్రం.. 2వ స్థానంలో ఏపీ
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 18,36,983 మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో ఎక్కువమంది 10,22,809(56%) మంది దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల మంది ఉన్నారు. కేసుల పరంగా తెలంగాణ ఐదో స్థానంలో.. ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని హెచ్‌ఐవీ బాధితులు, చికిత్స పొందుతున్న రోగుల గణాంకాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 1.31 లక్షల మంది బాధితుల్లో.. 60,640 మంది పురుషులు, 69,940 మంది మహిళలు, 780 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
ఏపీలో 2.22 లక్షల మంది బాధితులుంగా.. వీరిలో పురుషుల వాటా 98,432 కాగా.. 1,23,103 మంది మహిళలు, 810 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్‌ఐవీ బాధితు లంతా చికిత్స పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. హెచ్‌ఐవీ కేసుల్లో మహారాష్ట్రలో టాప్‌లో ఉంది. అక్కడ 3,18,492 మంది బాధితులుండగా.. 2.01 లక్షల కేసులతో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తమిళనాడులో 1.37 లక్షల మంది, యూపీలో 1.23 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ బాధితుల్లో.. పురుషులు 9.06 లక్షల మంది, మహిళలు 8.4 లక్షల మంది ఉన్నారు. టీనేజర్లలో 46,925 మంది బాలురు, 36,452 మంది బాలికలు హెచ్‌ఐవీకి చికిత్స తీసుకుంటున్నారు. టీనేజర్లలో.. తెలంగాణలో 4,278 బాలబాలికలు, ఏపీలో 7,890 మంది బాలబాలికలు ఉన్నారు.