ఆపరేషన్ కగార్‌ను పూర్తిగా నిలిపి వేయాలి
ABN , Publish Date - May 17 , 2025 | 04:13 AM
ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ ప్రభుత్వం దేశ పౌరులపై యుద్ధం చేయడం సరికాదని ఓయూ విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు.
దేశ పౌరులపై యుద్ధం సరికాదు
బండి సంజయ్ సానుకూలంగా స్పందించాలి
మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి
కాల్పుల విరమణ దిశగా అడుగులు వేయాలి
కేంద్రానికి మేధావులు, విద్యావంతుల విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మే 16(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ ప్రభుత్వం దేశ పౌరులపై యుద్ధం చేయడం సరికాదని ఓయూ విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీతో కేంద్రం చర్చలు సాగించాలని ఆచార్య హరగోపాల్ కోరారు. మారణహోమాన్ని ఆపడానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రయత్నించాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ విజ్ఞప్తిచేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ముందుగా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటన చేయాలన్నారు. కర్రెగుట్టల్లో మోహరించిన సైనిక బలగాలను వెనక్కి పిలిపించారే గానీ, ఆపరేషన్ కగార్‌ను మాత్రం కొనసాగిస్తున్నారని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ. గడ్డం లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 16 నెలల్లో 500 మందికి పైగా మృతిచెందారని చెప్పారు.
రాహుల్, ఖర్గేలకు వినతిపత్రం
ఆపరేషన్ కగార్ మీద కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించాల్సిందిగా భారత్ బచావో ప్రతినిధులు మే 9న రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను కలిసి వినతిపత్రం అందించినట్లు ఆ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ చెప్పారు. శాంతి చర్చల డిమాండ్‌ను ఇండియా కూటమి బలపరచాలని కోరగా, అందుకు అనుకూలంగా తనవంతు ప్రయత్నిస్తానని రాహుల్ మాట ఇచ్చినట్లు గోపీనాథ్ వివరించారు. ఆపరేషన్ కగార్‌ను పూర్తిగా నిలిపివేసి, కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రొఫెసర్లు కాసీం, కొండా నాగేశ్వర్, అన్వర్, భారత్ బచావో జాతీయ కార్యదర్శి గాదె ఇన్నయ్య, కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్, ఎస్‌ఎల్ పద్మ తదితరులతో పాటు సభాధ్యక్షత వహించిన ఆజాద్, ఇతర విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.