Osmania University: ఉస్మానియా యూనివర్సిటీపై మండలి జోక్యం తగదు
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:24 AM
ఉస్మానియా వర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేవిధంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) వ్యవహరిస్తోందని ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి పేర్కొన్నారు.
మా ప్రమేయం లేకుండా కోర్సుల ప్రకటన
ఉన్నతాధికారులకు ఓయూ రిజిస్ట్రార్ లేఖ
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేవిధంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) వ్యవహరిస్తోందని ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి పేర్కొన్నారు. వర్సిటీ అభ్యున్నతికి సూచనలు చేయాల్సిన ఉన్నత విద్యామండలి, తమ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీపై మండలి జోక్యం తగదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి, ఉన్నత విద్యామండలితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆయన లేఖలు రాశారు. మండలి నిర్ణయాలు అమలు చేయాలంటూ ఓయూపై ఒత్తిడి తీసుకొస్త్తున్నారని, విద్యా, విషయ, పాలనా వ్యవహరాలన్నింటిలోనూ ఉన్నత విద్యామండలే ఆదేశాలను జారీచేస్తోందని ఆయన పేర్కొన్నారు. వర్సిటీకి కనీసం సమాచారం ఇవ్వకుండా కొత్త కోర్సులను ప్రకటిస్తోందని, వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త యూజీ కోర్సులైన బీ.టెక్- బయోటెక్నాలజీని, ఇంజనీరింగ్ డిసిప్లిన్‌ను ప్రవేశ పెట్టాలంటూ ఇటీవల మండలి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
అయితే ఆయా కోర్సులను బోధించడానికి అవసరమైన నియత అధ్యాపకులు, తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు తమ వద్ద లేవని పేర్కొన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో 2025-26 నుంచి బీ.ఏ. తెలుగు (ఆనర్స్) కోర్సును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారని, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నిలయమైన ఆర్ట్స్ కశాళాలలో కొత్తగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును ప్రకటించడంతో విద్యార్థి సంఘాలతో పాటు వర్సిటీ పరిపాలనా గందరగోళానికి గురైందని తెలిపారు. గతేడాది వరకు అన్ని యూజీ మార్గదర్శకాలను వర్సిటీ స్థాయిలో నిర్ణయించేవారని. కానీ ఇప్పుడు ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకుంటోందని వివరించారు. విశ్వవిద్యాలయాన్ని సంప్రదించకుండా మండలి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది వర్సిటీ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తోందని రిజిస్ట్రార్ లేఖలో పేర్కొన్నారు.