Share News

Public Safety Awareness: హైదరాబాద్‌లో ఆపరేషన్‌ అభ్యాస్‌

ABN , Publish Date - May 07 , 2025 | 04:51 AM

హైదరాబాద్‌లో ఆపరేషన్‌ అభ్యాస్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించబడింది. ఈ డ్రిల్‌లో పౌర భద్రతపై అవగాహన కల్పిస్తూ, 12 విభాగాల సిబ్బంది పలు చర్యలు చేపట్టారు.

Public Safety Awareness: హైదరాబాద్‌లో ఆపరేషన్‌ అభ్యాస్‌

  • ఆర్మీ, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నేడు మాక్‌ డ్రిల్‌

  • సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల దాకా!

  • 4.15 గంటలకు సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌

  • మౌలాలీలో నిర్వహించనున్న 12 విభాగాల సిబ్బంది

  • ఆయా ప్రాంతాలకు చేరుకుని సంరక్షణ చర్యలు

  • యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై

  • నగర ప్రజలకు అవగాహన కల్పించనున్న అధికారులు

అల్వాల్‌, సికింద్రాబాద్‌, చంపాపేట, మే 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు.. రాజధాని హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ అనే సంకేత నామంతో పౌరుల భద్రత సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల దాకా ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల.. ఆర్మీ, ఎన్సీసీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపడతారు. పోలీసులు, అగ్నిమాపక విభాగం, వైద్య, మునిసిపల్‌ తదితర 12 విభాగాల సిబ్బంది ఈ డ్రిల్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. అందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు.. రెండు నిమిషాలపాటు సైరన్లు మోగిస్తారు. పారిశ్రామిక, అగ్నిమాపక శకటాల సైరన్లు మోగించి, పోలీస్‌ మైకులు, గస్తీ వాహనాల ద్వారా ప్రకటనలతో ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఆ సైరన్లు మోగగానే ప్రజలందరూ విద్యుత్‌, గ్యాస్‌ ఉపకరణాలను వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. బయట ఉంటే.. సమీపంలో సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం, ఇంట్లో ఉంటే తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లోపలే ఉండడం వంటివి చేయాలి. ఇక.. మధ్యాహ్నం 4.15 గంటల సమయంలో ‘ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, గోల్కొండ, కంచన్‌ బాగ్‌ డీఆర్‌డీవో, మౌలాలీ ఎన్‌ఎఫ్) వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీచేస్తుంది. ఐదంటే ఐదే నిమిషాల్లో.. అంటే 4.20 గంటలకల్లా అత్యవసర సేవల విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలిస్తారు. పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపడతాయి. రద్దీని నియంత్రించి.. రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహిస్తాయి. విపత్తు స్పందన దళాల సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడతారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తారు. వైద్య బృందాలు.. గాయపడ్డవారిని పరీక్షించి, ప్రాథమిక చికిత్స చేస్తాయి.


వారిని తాత్కాలిక ఆస్పత్రులకు తరలిస్తాయి. రవాణా సిబ్బంది.. ప్రజలను నిర్ణీత సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ.. రెవెన్యూ, పౌరసరఫరాలు, మునిసిపల్‌ శాఖల సిబ్బంది ప్రజలకు తక్షణ సహాయం అందిస్తారు. బ్లాక్‌ అవుట్‌ చర్యలు (అంటే దాడి జరిగినప్పుడు విద్యుద్దీపాలన్నింటినీ ఆపేయడం) కూడా మాక్‌ డ్రిల్‌లో భాగమే అయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ సూర్యాస్తమయానికి ముందే నిర్వహిస్తున్నందున ఇక్కడ వాటిని అమలుచేయట్లేదు. కాకపోతే.. దాడి జరిగినప్పుడు వీధిదీపాలు, ఇళ్లల్లో దీపాలు, దుకాణాల ముందు ఉండే సైన్‌బోర్డులు.. అన్నింటినీ ఆర్పివేయాలని, ఇళ్లల్లోంచి చిన్న కాంతి రేఖ కూడా బయటకు కనిపించకుండా కిటికీలు, తలుపులు, వెంటిలేటర్లు.. అన్నింటినీ మూసేయాలని, వాహనాల హెడ్‌లైట్లను కూడా ఆపేయాలని ప్రజలకు చెబుతారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లోని అత్యంత కీలకమైన భవనాలు, కట్టడాలు, చారిత్రక కట్టడాలను శత్రుదేశ విమానాలు గుర్తించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో మరోసారి సైరన్లు మోగడంతో మాక్‌ డ్రిల్‌ పూర్తవుతుంది. ఈ డ్రిల్‌ సజావుగా జరిగేలా తమకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా చేపట్టిన మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాచిగూడ, రాయచూర్‌, ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్లలోనూ బుధవారం నిర్వహించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే సివిల్‌ డిఫెన్స్‌ కంట్రోలర్‌ ఉదయనాథ్‌ కోట్లా పర్యవేక్షణలో ఈ డ్రిల్‌ చేపడతారు. యుద్ధ సమయంలో రైల్వే సిబ్బంది సన్నద్ధతను పరిశీలించడమే ఈ డ్రిల్‌ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.

Updated Date - May 07 , 2025 | 04:53 AM