Only Farmers Must Submit: రైతు బీమాకు స్వీయ ధ్రువీకరణ
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:48 AM
రైతు బీమా పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024 25 బీమా గడువు ఈ నెల
దరఖాస్తులను అన్నదాతలే ఇవ్వాలి
రైతుతోపాటు నామినీ ఆధార్ తప్పనిసరి
అర్జీలకు మరో మూడు రోజులే గడువు
18-59 ఏళ్ల వారికి అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రైతు బీమా పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024-25 బీమా గడువు ఈ నెల 13కు ముగుస్తోంది. మళ్లీ 2025-26కి ప్రీమియం చెల్లిస్తే ఈనెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. అయితే రైతు బీమా పథకంలో చేరే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్(స్వీయ ధ్రువీకరణ) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. అలాగే రైతులు తమతో పాటు నామినీకి చెందిన ఆధార్ కార్డు, పట్టా పుస్తకం దరఖాస్తుకు జతచేసి.. స్వయంగా వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. రైతు బీమా పథకం 2018లో మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)తో ఒప్పందం చేసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పట్టాదారుడై ఉండి, బీమా పథకంలో చేరిన రైతు ఏ కారణంతో చనిపోయినా, వారి కుటుంబానికి ఎల్‌ఐసీ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఏడేళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ఇందులో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులను లబ్ధిదారులుగా చేర్చారు. అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో పుట్టినవారికి ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. తాజాగా వ్యవసాయ శాఖ చేపడుతున్న కసరత్తులో.. 18 ఏళ్లు నిండి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులను ఈ పథకంలో చేరుస్తారు. 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ ప్రక్రియను ఈనెల 12, 13 తేదీల్లో చేపట్టనున్నారు. అయితే ఈ పథకంలో కొత్తగా చేరే వారు స్వీయ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులు(ఏవోలు), వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)ల వద్ద రైతు బీమా దరఖాస్తు పత్రాలు ఉంటాయి. రైతులు ఆ దరఖాస్తును పూర్తిచేసి, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు కాపీలను జతచేసి, దరఖాస్తు పత్రంపై సంతకం చేసి ఏఈవోకు అందజేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీచేసింది. అదేక్రమంలో నామినీ ఆధార్ కార్డు, వివరాలను కూడా ఏఈవోలకు ఇవ్వాలి. కాగా, ఈ ఏడాది జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసిన రైతులకు ఈ పథకంలో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆరో తేదీ నుంచి జారీ చేసిన పాస్ పుస్తకాలను ఈ ఏడాదికి పరిగణనలోకి తీసుకోబోమని వ్యవసాయశాఖ వెల్లడించింది.
మూడు రోజులే అవకాశం..ప్రస్తుత (2024-25) సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తం గా 42.16 లక్షల మంది రైతులు బీమా పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులోంచి 59- 60 ఏళ్ల వయస్సున్న రైతులను తొలగిస్తారు. 18 ఏళ్లు నిండిన రైతులను కొత్త లబ్ధిదారులుగా చేరుస్తారు. అయితే ఈ సంఖ్య ఎంత వరకు ఉంటుందనేది 14 నాటికి స్పష్టత వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ నెల 8న రైతు బీమాకు సంబంధించిన నియమ నిబంధనలను జారీ చేశారు. కమిషనరేట్ నుంచి జారీ చేసిన సర్క్యులర్‌ను జిల్లా, మండల, క్లస్టర్ అధికారులకు అంతర్గతంగా పంపించారు. కానీ రైతులకు సమాచారం చేరేలా అధికారులు విస్తృత ప్రచారం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి.