మహిళలను కించపరిచేలా.. నేతలు మాట్లాడితే ఊరుకునేది లేదు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:10 AM
భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సికింద్రాబాద్ వాసి మరియా ఫ్రాన్సిస్.. ఆస్తి తగాదాల నేపథ్యంలో తన బావ పరపతి ఉపయోగించి డెత్ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు... 3 రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు వచ్చాయి.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ హెచ్చరిక
రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ మహిళా కమిషన్ బహిరంగ విచారణ
భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సికింద్రాబాద్ వాసి మరియా ఫ్రాన్సిస్.. ఆస్తి తగాదాల నేపథ్యంలో తన బావ పరపతి ఉపయోగించి డెత్ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు... 3 రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు వచ్చాయి.
సికింద్రాబాద్ మహంకాళి ప్రాంతంలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేసే తన 23 ఏళ్ల కూతురు మూడున్నరేళ్లుగా కనిపించడం లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఫిర్యాదు చేశారు... ఈ కేసుపై వారంలోగా నివేదిక ఇవ్వాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి...
.. సోమవారం హైదరాబాద్‌లోని బేగంపేట ప్లాజా హోటల్‌లో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌డబ్ల్యూసీ) నిర్వహించిన బహిరంగ విచారణలో బాధితులు వెళ్లబుచ్చుకున్న గోడు, దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ వెంటనే స్పందించిన తీరు ఇది. ఇదే కాదు.. పోలీసు ఉద్యోగులైన మామ, ముగ్గురు ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక ముగ్గురు పిల్లలతో కలసి వెళ్లిపోయి ఓ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న మహిళకు న్యాయ సహాయం అందించడంతోపాటు.. 70మందికిపైగా గృహహింస, లైంగిక దాడి, వరకట్న వేధింపులు, సైబర్ నేరాల బాధిత మహిళలు చెప్పుకొన్న కష్టాలు విన్న ఎన్‌డబ్ల్యూసీ చైర్ పర్సన్ వారికి తగిన సహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఇలా జాతీయ మహిళా కమిషన్ తెలంగాణలో బహిరంగ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఇందులో పాల్గొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. సమాజం నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని.. మహిళల అభివృద్ధికి అనువైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీదా ఉందని విజయ రహత్కర్ పేర్కొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2022-23 మధ్యకాలంలో ఆ పార్టీ నేతలు.. కొన్నిసార్లు బీజేపీ మహిళా నేతలను, మరికొన్నిసార్లు యావత్ మహిళాలోకాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ గీతామూర్తి ఫిర్యాదు చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, చిరుమర్తి లింగయ్య వంటివారు అవమానకరంగా మాట్లాడారని.. అప్పటి గవర్నర్ తమిళిసైపై పాడి కౌశిక్‌రెడ్డి ఇష్టానుసారం నోరుపారేసుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా రహత్కర్ స్పందిస్తూ.. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా, కించపర్చేలా రాజకీయ నాయకులు వాచాలత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన నేతలకు నోటీసులు పంపాల్సిందిగా ఎన్‌డబ్ల్యూసీ అధికారులను ఆదేశించారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్