Share News

దమ్ముంటే కేటీఆర్‌ను వరంగల్‌ రమ్మను

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:35 AM

భద్రకాళి చెరువు సుందరీకరణ పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. దీనిపై దమ్ముంటే కేటీఆర్‌ను వరంగల్‌కు రమ్మను..

దమ్ముంటే కేటీఆర్‌ను వరంగల్‌ రమ్మను

  • భద్రకాళి చెరువు దగ్గరే తేల్చుకుందాం

  • వినయ్‌ భాస్కర్‌కు ఎమ్మెల్యే నాయిని సవాల్‌

హనుమకొండ చౌరస్తా, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘భద్రకాళి చెరువు సుందరీకరణ పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. దీనిపై దమ్ముంటే కేటీఆర్‌ను వరంగల్‌కు రమ్మను.. భద్రకాళి చెరువు వద్దే తేల్చుకుందాం..’’ అని బీఆర్‌ఆర్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.భద్రకాళి అమ్మవారి ముక్కుపోగులు, బంగారు ఆభరణాలు మాయం చేసే దొంగల్లాంటి బీఆర్‌ఎస్‌ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పట్ల అనుచితంగా మాట్లాడే హక్కు లేదని నాయిని విమర్శించారు.


సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను జైలులో పెట్టించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ లేకుండానే రూ.50 కోట్ల నిధులు విడుదల చేసుకోవడంతోపాటు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో కుడా నిధుల నుంచి రూ. 20కోట్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచార ఖర్చులకు, కుల సంఘాలకు, ఇతర అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. దీనిపై త్వరలోనే కేటీఆర్‌పై కేసు పెట్టబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని, ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగరని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 16 , 2025 | 04:35 AM