Share News

Kodangal Medical College: కొడంగల్‌ వైద్య కళాశాలకు అనుమతులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:56 AM

కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసింది...

Kodangal Medical College: కొడంగల్‌ వైద్య కళాశాలకు అనుమతులు

  • 50 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. 50 ఎంబీబీఎస్‌ సీట్లతో కళాశాలను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు మొదలుకానున్నాయి. కొడంగల్‌ కాలేజీకి అనుమతులు రావడంతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు, వాటిలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 4,100కు పెరిగింది. గత ఏడాది 8 కాలేజీలు, ఈ ఏడాది మరో కాలేజీకి అనుమతులు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్రకుమార్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 200 పడకల తాండూరు జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా చూపించి కొడంగల్‌ వైద్య కళాశాలకు అనుమతులు పొందింది. మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌)లో పడకలను కూడా కలిపితే మొత్తం 320 పడకలు అవుతాయని పేర్కొంది. కాలేజీ ఏర్పాటుకు అవసరమైన పడకల సంఖ్య, ఓపీ, ఐపీ ఉండటంతో ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. తాండూరులోనే నర్సింగ్‌ కాలేజీ కోసం నిర్మించిన భవనాలను ప్రస్తుతానికి వైద్య కళాశాల కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వం వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవన నిర్మాణాల కోసం తాండూరు-కొడంగల్‌ మధ్య అప్పాయపల్లిలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 30 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జిల్లాకు ఒక వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే తెలంగాణలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 03:56 AM