Budget: నాడు మిగులు బడ్జెట్.. నేడు అప్పుల కుప్ప
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:53 AM
విభజనకు ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఏ పార్టీనో, ప్రభుత్వాన్నో నిందించడం లేదని.. తెలంగాణ గురించి వాస్తవ పరిస్థితులనే చెబుతున్నానని పేర్కొన్నారు.

తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి
విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న
ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలకు మంత్రి స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విభజనకు ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఏ పార్టీనో, ప్రభుత్వాన్నో నిందించడం లేదని.. తెలంగాణ గురించి వాస్తవ పరిస్థితులనే చెబుతున్నానని పేర్కొన్నారు. రాజ్యసభలో గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణకు విభజన చట్టం కింద ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై నిర్మల స్పందించారు. ‘‘మీరు భావోద్వేగాలతో మాట్లాడితే.. మేం కార్యాచరణ ద్వారా సమాధానమిస్తాం’’ అని వ్యాఖ్యానిస్తూ తెలంగాణకు కేంద్రం ఏమేం చేసిందనేది వివరించారు. ఇందిరా గాందీ గెలుపొందిన మెదక్ నియోజకవర్గంలో తొలి రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రమే పునరుద్ధరించిందని, తద్వారా ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును కేంద్రం ఏర్పాటు చేసిందని, జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంకల్పించిందన్నారు. విభజన హామీలకు అనుగుణంగా సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని, వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారత్ మాల ప్రాజెక్టు క్రింద నాలుగు గ్రీన్ కారిడార్లను తెలంగాణలోనే ఏర్పాటు చేశామని, 2605 కిమీ జాతీయ రహదారులను నిర్మించామని, రూ. 5337 కోట్లతో రికార్డు స్థాయిలో రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేశామని, ఐదు వందే భారత్ రైళ్లను తెలంగాణలో ప్రారంభించామని చెప్పారు. ఏరుపాలెం-నంబూరు, మల్కాన్‌గిరి-పాండురంగాపురం మధ్య 753 కిమీ మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించామని, 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించామని వెల్లడించారు. పీఎం ఆవాస్ అర్బన్ కింద పట్టణాల్లో 2 లక్షల ఇళ్లు నిర్మించామని, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు మంజూరు చేశామని, 82 లక్షల ఆయుష్మాన్ భారత ఆరోగ్య కార్డులను ఇచ్చామని వివరించారు. 199 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు మొత్తం రూ. 2700 కోట్లు మంజూరు చేశామని, ప్రతి జిల్లాకు ఏడాదికి రూ. 50 కోట్ల చొప్పున విడుదల చేశామని తెలిపారు.
హాస్యాస్పదం: అనిల్ కుమార్ యాదవ్
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. గురువారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు గత పదేళ్లుగా గణనీయంగా నిధులు కేటాయించామని, విభజన హామీలను నెరవేరుస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటాను కేంద్రం సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తున్నప్పటికీ, న్యాయంగా దక్కాల్సినవి మాత్రం రావడం లేదన్నారు. తెలంగాణపై అన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, పైకి మాత్రం సవతితల్లి ప్రేమ చూపించడం ఎందుకు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.