Share News

NHAI: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ అరెస్టు

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:26 AM

వరంగల్‌లోని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ ఒక హోటల్‌ యాజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు.

NHAI: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ అరెస్టు

  • హైవేపై ఓ హోటల్‌ ముందు గుంతలు తవ్వించి యజమానికి వేధింపులు

  • లంచం కోసం మధ్యవర్తితో బేరసారాలు

  • రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పీడీని, మధ్యవర్తిని అరెస్టు చేసిన సీబీఐ

హైదరాబాద్‌/బీబీనగర్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ ఒక హోటల్‌ యాజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు బుధవారం ఆ వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. అతనికి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో హోటల్‌ యజమాని వేణు యాదవ్‌ను కూడా అరెస్టు చేశారు. జాతీయ రహదారిపై గూడూరు టోల్‌ ప్లాజా వద్ద జూన్‌లో ఓ వ్యక్తి తాజా కిచెన్‌ అనే హోటల్‌ ప్రారంభించాడు. ఆ హోటల్‌ సర్వీసు రోడ్డుకు దగ్గరగా ఉందంటూ ఎన్‌హెచ్‌ఏఐ వరంగల్‌ రీజియన్‌ అధికారులు నోటీసు జారీ చేశారు. తర్వాత రాకపోకలకు వీలు లేకుండా హోటల్‌ ముందు గుంతలు తీయించారు. హోటల్‌ యజమాని గుంతలు పూడ్చివేయడంతో అధికారులు మళ్లీ జేసీబీతో మరింత పెద్ద గోతులు తవ్వించారు.


ఈ క్రమంలో అతనికి సమీపంలోని కింగ్స్‌ హోటల్‌ యజమాని వేణు యాదవ్‌ ఫోన్‌ చేసి తనను కలవాలని కోరాడు. తాను దుర్గాప్రసాద్‌ తరఫున హోటళ్ల నుంచి మామూళ్ల వ్యవహారాలను చూస్తుంటానని, లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దుర్గాప్రసాద్‌ అక్కడ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నాలుగేళ్లు ఉంటారని, ఆయన అడిగినంత ఇస్తే ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని చెప్పాడు. అంత మొత్తం ఇవ్వలేనని తాజా కిచెన్‌ యజమాని చెప్పడంతో రూ.60 వేలకు బేరం కుదిరింది. అయితే పీడీ వేధింపులతో విసిగిపోయిన అతను హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సీబీఐ అధికారులు వల పన్ని ఆ హోటల్‌ వద్ద దుర్గాప్రసాద్‌, వేణు యాదవ్‌లు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 04:26 AM