Erragadda Hospital: ఎర్రగడ్డ ఆస్పత్రి రోగులకు కలుషిత ఆహారం
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:14 AM
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుని 71 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు, ఒకరు మృతి చెందారు. సంఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, దర్యాప్తు నివేదికలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
71 మందికి అస్వస్థత.. ఒకరి మృతి
ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం.. ఉస్మానియాలో చికిత్స
ఆస్పత్రిని సందర్శించిన డీఎంఈ, జిల్లా కలెక్టర్
ఘటనపై విచారణకు ఆదేశం.. నమూనాల సేకరణ
అనారోగ్యం వల్లే రోగి మృతి.. ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడి
ఘటనపై వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా!
హైదరాబాద్ సిటీ/ఎర్రగడ్డ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని 71 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రోగులకు అందించిన ఆహారం కలుషితం కావడమే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రోగులకు తొలుత బెల్లంతో చేసిన పాయసం వడ్డించారు. అనంతరం సాధారణ అన్నం, అరటిపండ్లు, గుడ్లు ఇచ్చారు. అయితే సాయంత్రం డీసీ వార్డు, క్టోజ్‌వార్డుల్లో కొందరు రోగులకు స్వల్పంగా వాంతులు, తీవ్రంగా విరేచనాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఏకంగా 71 మంది రోగులకు విరేచనాలయ్యాయి. ఉదయం రౌండ్స్‌కు వచ్చిన వైద్యులు.. పరిస్థితిని గమనించి రోగులకు చికిత్స ప్రారంభించారు. మేల్ డీసీ వార్డులో కరణ్(35) అనే రోగి బెడ్‌పై అచేతనంగా పడి ఉండగా.. వైద్యులు పరిశీలించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగించగా ఆరోగ్యం కుదుటపడింది. అయితే సాయంత్రానికి ముగ్గురికి డీహైడ్రేషన్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రి కిచెన్‌లో సరైన శుభ్రత పాటించపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆస్పత్రిలో మానసిక రోగులకు ఇచ్చే ఆహారాన్ని ముందుగా డైటీషియన్ రుచి చూస్తారు. ఆ తర్వాతే వారికి ఇస్తారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఇంతకుముందు ఉన్న డైటీషియన్ స్థానంలో ఓ సైకియాట్రిస్టుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలల నుంచి కిచెన్‌ను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.
నీటి శుభ్రతపై అనుమానాలు..!
ఆస్పత్రిలో తాగునీటి శుభ్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింటెక్స్‌లో నిల్వచేస్తున్న నీటి రక్షణ కోసం మూతలను సరిగ్గా వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఘటనపై విచారణ జరిపిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత రాయిరాల అన్నారు. మేల్ డీసీ వార్డులోని కరణ్.. ఫుడ్‌పాయిజన్ వల్ల మృతి చెందలేదని, అతనికి విరేచనాలు కాలేదని తెలిపారు. జ్వరం, అస్వస్థతతో చనిపోయాడని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది కూడా పాయసం తీసుకున్నారని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి మైక్రోబయాలజీ బృందం వచ్చి బాధితుల నుంచి మలం (స్టూల్) నమునాలు సేకరించారని, మంచినీటి స్వచ్చతపైనా ఐపీఎం నుంచి పరీక్షలు చేయిస్తున్నామని, వీటి నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయన్నారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ఫుడ్ పాయిజన్‌పై సిబ్బందిని, వైద్యులను ఆరా తీశారు. రోగులు అస్వస్థతకు గురికావడంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఎంఈ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news