Singur Dam: సింగూరుకు తక్షణమే మరమ్మతులు చేయండి
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:00 AM
మంజీరా నదిపై ఉన్న సింగూరు డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది.
వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి
తెలంగాణకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మంజీరా నదిపై ఉన్న సింగూరు డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్, ఈఎన్‌సీ(జనరల్)కు ఎన్‌డీఎ్‌సఏ సదరన్ రీజియన్ ప్రాంతీయ సంచాలకుడు గిరిధర్ లేఖ రాశారు. వానాకాలానికి ముందు ప్రాజెక్టు పరిస్థితిపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ పరిశీలన చేసిందని తెలిపారు. రిజర్వాయర్ ఎగువన రివిట్‌మెంట్ దెబ్బతిందని, ఆనకట్ట పై భాగంలో పిట్టగోడకు పగుళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
డ్యామ్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల దాకే నీటిని నిల్వ చేయాల్సి ఉండగా.. 2017లో ఇచ్చిన జీవో 885(30-10-2017) ప్రకారం కొన్నేళ్లుగా 520.50 మీటర్ల దాకా నీటిని నిల్వ చేయడం వల్ల డ్యామ్ ప్రమాదకర స్థితికి చేరిందని కమిటీ పరిశీలనలో వెల్లడైందని వివరించారు. ఈ నేపథ్యంలో తక్షణ మరమ్మతులకు ఉపక్రమించకపోతే జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021లోని నిబంధనల ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 21లోగా అందించాలని స్పష్టం చేశారు.