Share News

Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:13 AM

శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఏడాది క్రితమే తేల్చింది. జలాశయం కింద భూగర్భంలోని రాతిఫలకాల మధ్య బలహీన అతుకులున్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్‌ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

స్పిల్‌వే దిగువన 120 మీటర్ల లోతైన గుంత.. పునాదుల కిందకూ విస్తరించిందని అనుమానం

  • ఏడాది కిందటే ఏపీకి ఎన్‌డీఎస్‌ఏ నివేదిక

  • తాజాగా తెలంగాణ ఈఎన్‌సీ ఫిర్యాదుతో వెలుగులోకి..

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఏడాది క్రితమే తేల్చింది. జలాశయం కింద భూగర్భంలోని రాతిఫలకాల మధ్య బలహీన అతుకులున్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్‌ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. డ్యామ్‌ దిగువన ఏర్పడిన భారీ గొయ్యి 120 మీటర్ల లోతు ఉందని, డ్యామ్‌ పునాదుల కన్నా కిందకు ఆ గుంత విస్తరించి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే తగిన అధ్యయనాలు చేసి, మరమ్మతులకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 7-9 మధ్య ఎన్‌డీఎ్‌సఏ సభ్యులు(విపత్తుల నిర్వహణ) వివేక్‌ త్రిపాఠి నేతృత్వంలో నిపుణుల కమిటీ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. అదే నెలలో నివేదికను సమర్పించింది. తాజాగా శ్రీశైలం డ్యామ్‌ ప్రమాదపు అంచున ఉన్నా ఏపీ పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ ఎన్‌డీఎ్‌సఏకు లేఖ రాయగా.. ఏడాది కిందట నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది.


ఇవీ సిఫారసులు..

  • శ్రీశైలం జలాశయం దిగువన డైక్‌/కాఫర్‌ డ్యామ్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.

  • భారీ గొయ్యికి రెండు వైపులా రాతిఫలకాలకు బోల్టులు అమర్చి కాంక్రీట్‌తో రీఎన్‌ఫోర్స్‌ చేయాలి.

  • గొయ్యి పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాలి.

  • జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా? లేదా? అని డ్రిల్లింగ్‌ ద్వారా నిర్ధారించాలి.

  • ఎగువన ఎడమగట్టుకు రక్షణగా నిర్మించిన గోడ, పియర్‌, స్పిల్‌వే ఎగువ భాగానికి మరమ్మతు చేపట్టాలి.

  • 17/18 బ్లాకులకు రెండో చోట్ల అడ్డంగా వచ్చిన పగుళ్లకు మరమ్మతు చేయాలి.

  • డ్యామ్‌ దిగువన 4, 9, 10 నంబర్ల గేట్ల వద్ద ఏర్పడిన గుంతల లోతును అధ్యయనం చేసి, దాని ఆధారంగా మరమ్మతులను నిర్వహించాలి.

  • 16, 17వ బ్లాకుల వద్ద ఏర్పాటు చేసిన రివర్‌

  • స్లూయి్‌సల నుంచి లీకేజీని అరికట్టడానికి అత్యంత ప్రాఽ దాన్యతతో మరమ్మతులు చేయాలి.

  • డ్యామ్‌ ఫౌండేషన్‌ గ్యాలరీలో ఆందోళనకర రీతిలో సీపేజీ జరుగుతోంది. డ్యామ్‌ బ్లాకులను 4-5 భాగాలుగా విభజించి సీపేజీని అంచనా వేయాలి. సీపేజీ అధికంగా ఉన్న బ్లాకులకి కర్టైన్‌ గ్రౌటింగ్‌ చేయాలి.

  • డ్రైయిన్‌ రంధాల నుంచి పూడిక తొలగించి సీపేజీ నీళ్లు బయటకి వెళ్లే ఏర్పాట్లు చేయాలి. పూడిక తొలగింపు సాధ్యం కాని పక్షంలో అత్యంత జాగ్రత్తగా కొత్త రంధ్రాలు వేయాలి. భూకంపాల ముప్పు, ప్రాజెక్టుకు వచ్చే వరదపై మళ్లీ అధ్యయనాలు చేపట్టాలి.


మే చివరికి మరమ్మతులు పూర్తవ్వాలి

  • ఏపీ సర్కార్‌కు డెడ్‌లైన్‌ విధించిన ఎన్‌డీఎస్‌ఏ

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌ ఆదేశించారు. స్పిల్‌వేకు దిగువన ఏర్పడిన భారీ గొయ్యితో డ్యామ్‌ భద్రతకే పెను ప్రమాదం పొంచి ఉందంటూ ఏడాది కిందటే నిపుణుల బృందం నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. 120 మీటర్ల లోతైన భారీ గొయ్యిని తక్షణమే పూడ్చాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనులు, ప్లంజ్‌పూల్‌తో పొంచి ఉన్న ప్రమాదంపై తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) అనిల్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ నుంచి ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌ వర్చువల్‌ విధానంలో గురువారం సమీక్ష జరిపారు. ఇందులో ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, శ్రీశైలం చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌బాషా, ఎస్‌ఈ మోహన్‌, తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి పరిధిలో ఉందని అనిల్‌జైన్‌ ప్రశ్నించగా.. ఇప్పటిదాకా స్పష్టత లేదని, నిర్వహణను మాత్రం తామే చూస్తున్నామని ఏపీ బదులిచ్చింది. నిర్వహణ చూసే వారే యజమానులని పేర్కొన్న అనిల్‌జైన్‌.. శ్రీశైలం ప్రాజెక్టు యజమానిగా శ్రీశైలం సీఈ, నాగార్జునసాగర్‌ యజమానిగా నల్లగొండ సీఈ ఉంటారని స్పష్టం చేశారు. ఆయా రిజర్వాయర్లను రక్షించుకోవడం, మరమ్మతులు చేయించడం ఓనర్ల బాధ్యత అని, విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2009లో వచ్చిన వరదలతో రిజర్వాయర్‌ దిగువ భాగంలో భారీ గుంత ఏర్పడిందని, ప్రెజర్‌ సెల్స్‌ పనిచేయడం లేదని, డ్రెయినేజీ రంధ్రాలు మూసుకుపోయాయని తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ గుర్తు చేశారు. ప్లంజ్‌ పూల్‌ను వెంటనే కాంక్రీట్‌ దిమ్మెలతో నింపాలని కోరారు. అయితే, ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం అధ్యయనం చేసి, సిఫారసు చేయడానికి వీలుగా కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రానికి(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు) బాధ్యతలు అప్పగించామని ఏపీ వివరణ ఇచ్చింది. వానాకాలంలోపు పూర్తి చేసేందుకు వీలుగా ఇప్పటి నుంచే మరమ్మతులు ప్రారంభించాలని, మే ఆఖరులోగా పూర్తి చేయాలని అనిల్‌జైన్‌ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ప్రాజెక్టు వద్ద ప్లంజ్‌పూల్‌ను పూడ్చేందుకు శుక్రవారం నుంచే రంగంలోకి దిగాలని ఏపీ జలవనరుల శాఖ నిర్ణయించింది. గొయ్యి పూడ్చివేతకు వినియోగించిన టెక్నాలజీపై మేధోమధనం చేపట్టనున్నట్లు తెలిసింది.

Updated Date - Mar 07 , 2025 | 05:13 AM