COVID-19: కొవిడ్ సేవలకు ఫీవర్ హాస్పిటల్ సిద్ధం
ABN , Publish Date - May 26 , 2025 | 04:12 AM
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
బర్కత్‌పుర, మే 25 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే కరోనాను ఎదుర్కోవడానికి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. కరోనా పట్ల ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆస్పత్రిలో 216 పడకలను, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనా లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చిన వారికి వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని ఆయన సూచించారు.