Share News

పదేళ్ల పోరాటం ఫలించేనా?

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:15 AM

వ్యాపార కూడలిగా నిత్యం రద్దీగా ఉండే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో బస్‌ డిపో ఏర్పాటు కోసం పదేళ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.

 పదేళ్ల పోరాటం ఫలించేనా?
ఆర్టీసీ డిపోకు కేటాయించిన స్థలంలో కడుతున్న మునిసిపల్‌ బిల్డింగ్‌ భవనం

తిరుమలగిరిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు ఎప్పటికో

స్థలం ఉన్నా, పట్టించుకోని వైనం

రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్యమం

వ్యాపార కూడలిగా నిత్యం రద్దీగా ఉండే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో బస్‌ డిపో ఏర్పాటు కోసం పదేళ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పట్టణం నాలుగు జిల్లాలకు కూడలిగా ఉంది. నిత్యం పెద్దసంఖ్యలో ప్రజలు ఈ పట్టణం మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. అలాంటి ప్రాముఖ్యం కలిగిన ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా డిపో హామీ మాత్రం నెరవేరడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి డిపో ఏర్పాటు అంశంపై స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఈ ప్రభుత్వమైనా తమ కలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి)

మేజర్‌ పంచాయతీగా ఉన్న తిరుమలగిరి పట్టణాన్ని రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన సమయంలో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. వ్యాపార, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పట్టణానికి, స్థానిక మార్కెట్‌కు నిత్యం చుట్టుపక్కల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు వస్తుంటారు. సరైన బస్సు సౌకర్యాలు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంగా తుంగతుర్తితో పాటు ఏ మండలాలకు చెందిన విఽవిధ గ్రామాలకు సరైన బస్‌సౌకర్యం లేదు. తిరుమలగిరిలో బస్‌ డిపో నిర్మించి మారుమూల గ్రామాలకు పట్టణాలకు అన్నివేళల్లో బస్‌సౌకర్యం కల్పించాలని పదేళ్లు ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. డిపో సాధన కోసం నిర్విరామంగా ఉద్యమాలు చేస్తున్నారు. నిరాహార దీక్షలతో పాటు పలువురు మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించి నిత్యం డిపో అంశం ప్రాధాన్యాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. గతేడాది తిరుమలగిరి డిపో సాధన సమితి పేరిట కమిటీ ఏర్పాటు చేసి వివిధ రూపాల్లో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.

నాలుగు జిల్లాల కూడలి

తిరుమలగిరి మునిసిపల్‌ కేంద్రం నాలుగు దిక్కులా జనగామ, యాదాద్రిభువనగిరి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు ప్రధానకూడలి. ఆయా జిల్లాలకు చెందిన మండలాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ వెళ్లేందుకు తిరుమలగిరి పట్టణానికి వచ్చి బస్సులను ఆశ్రయిస్తుంటారు. చుట్టుపక్కల మండలాలు సుమారు 300 గ్రామాల ప్రజలు తమ, తమ అవసరాలకోసం, తిరుమలగిరికి వస్తుంటారు. నియోజకవర్గంలోనే వ్యాపారపరంగా తిరుమలగిరి అతిపెద్ద పట్టణం. దీంతో ఎంతోమంది తిరుమలగిరికి రాకపోకలకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుమలగిరి మండలంతో పాటు, చుట్టుపక్కల మండలాలలోని కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు బస్‌ సౌకర్యం లేదు. ఇప్పటికీ ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

స్థలం ఉన్నా, నిర్మాణానికి ఆటంకం

గత పదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మినీ బస్‌డిపో కోసం మునిసిపల్‌ కేంద్రంలో 3.20 ఎకరాల స్థలం కేటాయించి, ఆర్టీసీ పేరిట రిజిస్ట్రేషన చేశారు. ఇప్పుడు ఆ స్థలంలో నూతనంగా మునిసిపల్‌ బిల్డింగ్‌ నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ భూమి విషయంలో ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు వెళ్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం మునిసిపల్‌ కార్యాలయ నిర్మాణానికే మొగ్గుచూపింది.

నిరుపయోగంగా బస్టాండ్‌

పాతతిరుమలగిరి ప్రాంతంలో 2000 సంవత్సరంలో 2.20 ఎకరాల స్థలంలో బస్టాండ్‌ నిర్మించినా, అది నిరుపయోగంగా మారింది. పాత గ్రామంలో నిర్మించడంతో అక్కడికి అన్నిడిపోల బస్సులు వెళ్లలేదు. ఊర్లోకి వెళ్లి, తిరిగి క్రాస్‌రోడ్డుకు రావడానికి డీజిల్‌ ఖర్చు అధికం అవుతుందని బస్‌లు బస్టాండ్‌లోకి వెళ్లడం మాన్పించారు. పాత ఊరు ప్రజలంతా ఏ ఊరికి వెళ్లినా, వచ్చినా, ఆటోలల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

బస్టాండ్‌ స్థలంలో డిపో, సంత

మైదానంలో బస్టాండ్‌

తిరుమలగిరిలోనే బస్‌డిపోకు అన్నిరకాల అనువైన వసుతులు ఉన్నాయని, ఆర్టీసీ సంస్థ డిపో ఏర్పాటుచేస్తే లాభసాటిగా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్య్తంచేస్తున్నారు. బస్‌స్టాండ్‌ స్థలంలో బస్‌డిపో, సంత మైదానంలో బస్‌స్టాండ్‌ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని డిపో సాధన సమితి, ప్రజలు కోరుతున్నారు.

రేపు సబ్బండ కులాల దీక్ష

తిరుమలగిరిలో బస్‌డిపో సాధనలో భాగంగా ఈనెల 5వ తేదీన చేపడుతున్న సబ్బండ కులాల దీక్షను విజయవంతం చేయాలని డిపో సాధన సమితి కన్వీరర్‌ కడెం లింగయ్య ఓ ప్రకటనలో కోరారు.

తిరుమలగిరిలోనే బస్‌ డిపో నిర్మించాలి

తిరుమలగిరిలోనే బస్‌ డిపో నిర్మించాలి. మరో చోటుకు తరలించొద్దు. డిపో నిర్మిస్తే చుట్టుపక్కల సుమారు 400 గ్రామాలకు బస్‌ సౌకర్యం కలుగుతుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తిరుమలగిరిలోనే డిపో నిర్మించేందుకు కృషి చేయాలి. లేనిపక్షంలో ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేపడతాం.

కడెం లింగయ్య, డిపో సాధన సమితి కన్వీనర్‌

Updated Date - Jan 04 , 2025 | 12:15 AM