కందులు కొనేవారేరీ?
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:12 AM
మోత్కూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన కంది పంటను రైతులు అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.

కందులకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు రూ.7,550 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.6500 నుంచి రూ.7,100 వరకు కొంటున్నారు. కంది చేలు కోసి సుమారు రెండు మాసాలు అవుతుంది. పంట కోత సమయంలో ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాల కంది రైతులు కొందరు తిరుమలగిరి మార్కెట్‌కు తీసుకెళ్లి ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాక మద్దతు ధరకు అమ్ముకుంటే ఇంతో, అంతో కలిసొస్తుందని దాచిపెట్టారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో తెరిచింది ఒక్క కేంద్రమే
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ మద్దతు ధరకు కందులు కొనడానికి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మోత్కూరు మార్కెట్ యార్డులో రైతు సేవా సహకార సంఘం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గత నెల 26న ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పుడే ఎమ్మెల్యే మందుల సామేలు ఈ సారి కంది పంట తక్కువగా ఉందని, ఇప్పటికే కొందరు రైతులు విక్రయించినందున మిగిలిన రైతులవైనా ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో తెరిచిన కందుల కొనుగోలు కేంద్రం ఇదొక్కటే. కందుల నాణ్యత పరిశీలకుడిగా మోత్కూరు ఏఈవో గోపీనాథ్‌ను నియమించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 17రోజులైనా నేటికీ ఒక్క బస్తా కూడా కొనలే దు. దీంతో కందులు కొననప్పుడు కొనుగోలు కేంద్రం బ్యానర్ ఎందుకంటూ రైతులు మంగళవారం బ్యానర్ తొలగించి నిరసన వ్యక్తం చేశారు.
కందులను తిరుమలగిరికి తరలించిన రైతులు
విత్తు ముందా, చెట్టు ముందా అన్న సామెతలా రైతులు వంద క్వింటాళ్ల పైన కందులు తెచ్చి రాశులు పోస్తేనే కొంటామని కేంద్రం నిర్వాహకులు, వారు కొంటుంటే మేము తెచ్చి రాశులు పోస్తామని రైతులు అంటూ వారం పది రోజులు నిర్వాహకులు కందులు కొనలేదు. రైతులు రోజు వచ్చి కందులు కొంటారా అని అడిగిపోవడమే తప్ప కేంద్రానికి కందులు తీసుకురాలేదు. చివరకు గుండాల, ఆత్మకూరు, మోత్కూరు రైతులు ఐదారు రోజుల క్రితం సుమారు వంద క్వింటాళ్ల కందులు తెచ్చి మోత్కూరు కందుల కొనుగోలు కేంద్రంలో రాశులు పోశారు. కందులు తూర్పార బట్టి, ఆరబెట్టారు. ఐనా కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ శాతం 12 కన్నా ఎక్కువ ఉన్నందున కొనడం లేదని నాణ్యత పరిశీలకుడు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెబుతుండగా మూడు నాలుగు రోజులు ఎండబోసినా ఉదయం తేమ శాతం 13 చూపిస్తోందని, సాయంత్రం 15 చూపిస్తోందని అదేమి మాయిశ్చర్ యంత్రమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఎండ బెట్టినట్టయితే కందులు నల్లబడి ప్రైవేటు వ్యాపారులు కూడా కొనకుండా అవుతాయని కంది రైతులు పట్టూరి వీరసోమయ్య(పారుపల్లి), మంటిపల్లి యమున(నర్సాపురం), కాటం రాములు(రాఘవాపురం), దయ్యాల శ్రీహరి(పారుపల్లి) అన్నారు. కోతులు, పందుల బాధ భరించలేక పోతున్నామని, ఎన్ని రోజులు ఉన్నా ఏదో సాకుచెప్పడం తప్ప ఇక్కడ కొనేలా లేరని ఈ నెల 11న, 12న పలువురు రైతులు రాశులు పోసిన కందులను తిరిగి బస్తాల్లో నింపుకుని ట్రాక్టర్లలో తిరుమలగిరి తీసుకెళ్లారు. తాము ఇంటి నుంచి నేరుగా తిరుమలగిరి తీసుకెళ్లకుండా ఇక్కడకు తేవడం వల్ల తమపై ట్రాక్టర్ రవాణా చార్జీలు, రాశులు పోయడం, ఆరబెట్టడం, తూర్పార బట్టడం, బస్తాల్లో నింపడం తదితర పనులకు కూలీల ఖర్చు అదనంగా మీదపడిందన్నారు.
కోతులు, పందులు, దోమల బెడద
మోత్కూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కందులు తెచ్చి రాశులు పోస్తే రక్షణ లేదని రైతులు పేర్కొంటున్నారు. కోతులు, పందులు వచ్చి ఆగమాగం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి మార్కెట్లో లైట్లు కూడా వెలుగవని, రాశుల వద్ద కాపలాగా పడుకుంటే దోమల బెడద, చీకట్లో పురుగుబూసి వస్తుందన్న భయంతో జాగారాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొనలేనప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేయడమెందుకని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కందులు వెంటనే కొనాలని లేని పక్షంలో కేంద్రాన్ని మూసి వేయాలని అక్కడ రాశులు పోసిన రైతులు అంటున్నారు.