పంచాయతీ కార్యదర్శులపై కొరడా
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:50 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 199మంది పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషనరీ (శిక్షణ) సమయంలోనే విధులకు డుమ్మా కొడుతున్నారు. సర్వీస్ క్రమబద్ధీకరణ జరగకముందే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా నెలలు గా గైర్హాజరవుతున్నారు.

అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు
ఉమ్మడి జిల్లాలో 199 మంది కార్యదర్శులకు షోకాజ్
నల్లగొండ జిల్లాలో 99 మంది సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం
ఆంధ్రజ్యోతి, సూర్యాపేట కలెక్టరేట్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 199మంది పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషనరీ (శిక్షణ) సమయంలోనే విధులకు డుమ్మా కొడుతున్నారు. సర్వీస్ క్రమబద్ధీకరణ జరగకముందే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా నెలలు గా గైర్హాజరవుతున్నారు. ఇటీవల కొందరు విధుల్లో చేరేందుకు రాగా, వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. షోకాజ్‌లకు వారిచ్చే వివరణకు సంతృప్తి చెందితే ఎలాంటి చర్యలు ఉండవు. లేకుంటే చర్యలకు లోబడాల్సి ఉంటుంది. కాగా, నల్లగొండ జిల్లాలో 99మంది పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. వారి సర్వీ్‌సను బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రొబేషనరీ సమయంలో ఏ శాఖకు సం బంధించిన ఉద్యోగి అయినా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదు. ఒకవేళ అయితే అధికారుల చర్యలకు గురికావాల్సి ఉంటుంది. ప్రతీ ఉద్యోగికి రెండేళ్ల ప్రొబేషనరీ సమయం ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అంకితభావంతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ విధుల్లో పొరపాట్లు చేస్తే వారి సర్వీస్ క్ర మబద్ధీకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకోసం ప్రతీ ఉద్యోగి ప్రొబేషనరీ సమయంలో ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో199 మంది కార్య దర్శులకు షోకాజ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 199 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారు లు షోకాజ్ జారీ చేశారు. నల్లగొండ జిల్లాలో 99 మంది, సూర్యాపేట జిల్లాలో 70మంది, యాదాద్రి జిల్లాలో 30మంది గ్రామకార్యదర్శులు ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరయ్యా రు. ఇటీవల వారు విధుల్లో చేరేందుకు రాగా, వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు షోకాజ్ జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరూ వారికి కేటాయించిన గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే షోకాజ్‌లపై విచారణకు ప్రత్యేకాధికారిని నియమించనున్నారు. ఏదైనా అత్యవసర పనుల నిమిత్తం, ఆరోగ్య కారణాల కారణంగా గైర్హాజరైతే మాత్రం వారికి చర్యల నుంచి మినహాయింపు దక్కనుంది.
గైర్హాజరుతో ఇతరులపై పనిభారం
ఉమ్మడి జిల్లాలో సుమారు 199 మంది గ్రామకార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారి విధులు మిగిలిన వారు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పడుతోంది. అసలే గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేవు. గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు ఇతర ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి విధులు గ్రామకార్యదర్శులు చేయాల్సి ఉంది. దీంతో గైర్హాజరైన కార్యదర్శుల గ్రామాల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు సమీప పంచాయతీల కార్యదర్శులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో కొంతమంది కార్యదర్శులు పనిభారం మోయలేక ఇబ్బందులు పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
పోటీ పరీక్షల కోసం గైర్హాజరు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో గ్రూప్-1, గ్రూప్-2తో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యదర్శులు కొందరు ఆయా పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు విధులకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ప్రొబేషనరీ సమయం కావడంతో నెలల తరబడి వారికి సెలవులు మంజూరు చేయడం వీలుకాదు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే ఒకవైపు విధులు నిర్వహించుకుంటూ మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో కార్యదర్శులు విధులకు గైర్హాజరై పోటీ పరీక్షలు రాసినట్లు సమాచారం.
నల్లగొండ కలెక్టర్ కఠిన నిర్ణయం
నల్లగొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి వారి సర్వీ్‌సకు బ్రేక్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఇటీవల మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల గుర్రంపోడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి గైర్హాజరైన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరుగురిని విధుల నుంచి తొలగించడంతోపాటు ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజులకే 99మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీ్‌సను బ్రేక్ చేస్తూ మరో సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సర్వీస్ బ్రేక్ చేసినా, వారిని సస్పెండ్ చేయకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే సర్వీస్ బ్రేక్ చేయడంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్ కోల్పోతామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యదర్శులకు నష్టం ఉండదు : ఇలా త్రిపాఠి, నల్లగొండ జిల్లా కలెక్టర్
ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరైన వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తాం. అయితే పం చాయతీ కార్యదర్శుల విషయంలో మానవ తా దృక్పథంతో వారిని సస్పెండ్ చేయకుండా సర్వీ స్ బ్రేక్ చేసి విధుల్లోకి తీసుకున్నాం. జిల్లాలో సుమారు 99మంది పంచాయతీ కార్యదర్శులు ముం దస్తు అనుమతి లేకుండా నెలలతరబడి విధులకు గైర్హాజరయ్యారు. వీరిలో కాం ట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు. సర్వీస్ బ్రేక్ చేసి విధుల్లోకి తీసుకోవడం వల్ల వారికి నష్టమేమీ ఉండదు.
గైర్హాజరైన కార్యదర్శులకు షోకాజ్‌లు జారీ చేశాం.: నారాయణరెడ్డి, డీపీవో, సూర్యాపేట జిల్లా
ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా విధులకు గైర్హాజరైన పం చాయతీ కార్యదర్శులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వారందరికీ కేటాయించిన గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సమీప గ్రామాల కార్యదర్శులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం. షోకాజ్‌లకు వివరణ ఇచ్చిన అనంతరం కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.