Share News

ఉద్యోగ నియామకమెప్పుడో?

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:06 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశలో 2008 డిసెంబరులో నిర్వహించిన మెగా డీఎస్సీ అభ్యర్థుల భవిష్యతకు భరోసా ప్రశ్నార్థకమైంది.

 ఉద్యోగ నియామకమెప్పుడో?

ఎస్జీటీ పోస్టింగ్‌ వెయిటింగ్‌

16 ఏళ్లుగా డీఎస్సీ అభ్యర్థుల గోస

విద్యార్హత పత్రాలు సేకరించి నాలుగు నెలలు

అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి అర్బన)

ఉమ్మడి ఆంధ్రప్రదేశలో 2008 డిసెంబరులో నిర్వహించిన మెగా డీఎస్సీ అభ్యర్థుల భవిష్యతకు భరోసా ప్రశ్నార్థకమైంది. 16ఏళ్లు దాటినా ఎస్జీటీ ఉద్యోగాల కోసం మొక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్లు లేవు. 2008 డీఎస్సీ నోటిఫికేషన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ సమయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు పర్చింది. ఈ మేరకు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం విద్యాశాఖను ఆదేశించింది. అభ్యర్థులు అప్పటినుంచి తమ ఉద్యోగాల కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ విద్యాశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన విడుదల చేసిన మూడు నెలల తర్వాత జీవో నెంబరు 28ద్వారా చిల్డ్రన సైకాలజీ సబ్జెక్టు ప్రాతిపాదికన ఉమ్మడి రాష్ట్రంలో 30శాతం కేవలం డీఈడీ అర్హులకు కేటాయించడాన్ని బీఈడీ అభ్యర్థులు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో జీవోను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16ఏళ్ల క్రితం మిగిలిన 2,364 మంది బీఈడీ అభ్యర్థులకు తిరిగి 2024 సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 5 వరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 1,399మంది ఉన్నారు. అదేవిధంగా 2024 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించగా ఉమ్మడి జిల్లాలో 163మంది (యాదాద్రిలో 30మంది) అభ్యర్థులు ఉన్నారు.

2017, 2022 సంవత్సరాల్లో వీరికి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయా తీర్పులను పట్టించుకోలేదు. 2021లో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం అక్కడి అభ్యర్థులను ఎస్జీటీ ఉద్యోగులుగా నియమిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలని 2023ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 8న విడుదల చేసిన జీవో నంబరు 9ద్వారా ఎస్జీటీ ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆచరణలోకి రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం రేవంతరెడ్డి నిర్ణయం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ నెల 3న రాజధానిలోని ప్రజాభవనలో అభ్యర్థులు ధర్నా చేశారు. గత ఏడాది మంత్రివర్గ ఆమోదంతో జీవో నంబరు 9న విడుదల చేసి ఫిబ్రవరితో ఏడాది కావస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. రెండోసారి అర్హత పత్రాల పరిశీలన జరిపి సుమారు 4నెలలు గడిచింది. ఇతర ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేసుకోకుండా ప్రభుత్వం వద్దే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఉండిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్జీటీలుగా నియమించి తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు.

తీరని అన్యాయం జరుగుతోంది

తమకు, తమ కుటుంబాలకు 16 ఏళ్లుగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. కోర్టు ఆదేశించినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రెండు పర్యాయాలు అర్హత ప్రతాలను పరిశీలన చేశారు. ప్రభుత్వం వద్దే ఆ ధ్రువపత్రాలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వం నిర్ణయం, నియామకాల కోసం ఎదురుచూస్తున్నాం.

మేకల సదానందం గౌడ్‌, గూడూరు, బీబీనగర్‌, యాదాద్రి జిల్లా

ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు

2008 డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ఉమ్మడి జిల్లా స్థాయిలో నియామకం జరగాల్సి ఉంది. దాదాపు 10 రోజుల్లో అభ్యర్థుల నియామకం జరుగుతుండొచ్చు. అభ్యర్థుల ఎదురుచూపులకు తెర పడేందుకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తోంది.

సత్యనారాయణ, డీఈవో, యాదాద్రి జిల్లా

Updated Date - Jan 17 , 2025 | 12:06 AM