Share News

నల్లమలలో నీటితొట్లు, చెక్‌డ్యాంలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:40 AM

నల్లమల అడవుల్లో వన్యప్రాణులకు నీటిఎద్దడి తలెత్తకుండా వేసవికి ముందే అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

 నల్లమలలో నీటితొట్లు, చెక్‌డ్యాంలు
నీటితొట్లు, చెక్‌డ్యాం సమీపంలో వన్యప్రాణి

వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ముందస్తు చర్యలు

కొత్తగా రెండు బోర్లు, నీటితొట్లు, చెక్‌డ్యాం నిర్మాణం

నల్లమల అడవుల్లో వన్యప్రాణులకు నీటిఎద్దడి తలెత్తకుండా వేసవికి ముందే అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో ఏర్పాటుచేసిన చెక్‌డ్యాంలు, నీటితొట్లను సమయానుకూలంగా నింపడంతో పాటు మరో చెక్‌డ్యాం నిర్మాణాన్ని చేపడతున్నారు. దేవరకొండ డివిజనలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులు, జంతువులు నీటితొట్ల వద్ద సేదతీరుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-దేవరకొండ)

నల్లమల పరిధిలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్డ్వ్‌ ఫారెస్ట్‌ కింద చందంపేట మండలం కంబాలపల్లి రేంజ్‌లో అటవీ ప్రాంతం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కర్నూలు జిల్లాలో 26,795 హెక్టార్లలో నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉంది. కంబాలపల్లి రేంజ్‌ పరిధిలో అటవీ, వన్యప్రాణులు, జంతువుల సంరక్షణకు అటవీ శాఖ ఇటీవల చర్యలు చేపట్టింది. నల్లమల అటవీప్రాంతంలో చిరుత పులులతో పాటు వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అటవీ జంతువుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో గతంలో అభివృద్ధి పనులను చేపట్టింది. అటవీ అభివృద్ధి, రోడ్లు, చెక్‌డ్యాంలతో పాటు 50కిపైగా సీసీ కెమెరాలు, వాచటవర్‌, బేస్‌క్యాంపులు అటవీ చుట్టూ ఇనుప కంచె ఏర్పాటుచేశారు. వేసవిలో వన్యప్రాణులు, జంతువుల దాహార్తి తీర్చుకునేందుకు నల్లమలలో 150కిపైగా నీటితొట్లు, 20వరకు చెక్‌డ్యాంలు ఉన్నాయి. కొత్తగా 50 నీటితొట్లు, చెక్‌డ్యాం ఏర్పాటు చేస్తున్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా చెక్‌డ్యాంలను, నీటితొట్లను నింపుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతంలో కొత్తగా రెండు బోర్లు వేసి పైప్‌లైనను ఏర్పాటు చేశారు. దీనిద్వారా చెక్‌డ్యాంలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే అడవిలో 45కు పైగా చిరుత పులులు, ఎలుగుబండ్లు, రేస్‌కుక్కలు, మనుబోతులు, దుప్పులు, జింకలు, కొండెంగలు, నెమళ్లు, అడవిపందులు, కుందేళ్లు వేల సంఖ్యలో ఉన్నాయని, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

వన్యప్రాణుల దాహార్తి

తీర్చేందుకు చర్యలు

కంబాలపల్లి అటవీ శాఖ రేంజ్‌ పరిధిలో ఇటీవల రెండు బోర్లు వేశాం. బోర్ల నీటిని పైప్‌లైన, ట్యాంకర్ల ద్వారా నీటితొట్లు, కుంటలు నింపుతున్నాం. దీంతో అటవీ జంతువులు, వన్యప్రాణులు నీటితొట్ల వద్దకు వచ్చి నీరుతాగి సేదతీరుతున్నాయి. వన్య ప్రాణులకు, జంతువులకు తాగునీటి ఎద్దడి కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

భాస్కర్‌, కంబాలపల్లి రేంజ్‌ అటవీ శాఖ అధికారి

Updated Date - Feb 08 , 2025 | 12:40 AM