Share News

గోదారమ్మ కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Feb 06 , 2025 | 12:33 AM

బిక్కేరు వాగులోకి గంధమల్ల రిజర్వాయరు నుంచి ఇటీవల వదిలిన గోదావరి జలాలు వాగు దిగువన (చివరన) ఉన్న మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చేరకముందే నిలిపివేశారు.

గోదారమ్మ కోసం ఎదురుచూపు
మోటర్ల వద్ద దిగాలుగా ఉన్న రైతులు

ఎడారిని తలపిస్తున్న బిక్కేరువాగు

వరి రైతుల విలవిల

చివరి మండలాలకు చేరక ముందే గోదావరి జలాల నిలిపివేత

ముదురు తున్న ఎండలు... ఎండుతున్న పంటలు

మోత్కూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): బిక్కేరు వాగులోకి గంధమల్ల రిజర్వాయరు నుంచి ఇటీవల వదిలిన గోదావరి జలాలు వాగు దిగువన (చివరన) ఉన్న మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చేరకముందే నిలిపివేశారు. ఆలేరు నియోజకవర్గం అంబాల శివారు వరకు రాగానే నిలిపివేడంతో ఇదేమి రాజకీయమని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులు ప్రశ్నిస్తున్నారు. బిక్కేరు వాగులోకి నీరు రాకపోవడంతో యాసంగి సాగు చేసిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

బిక్కేరు నీరే ఆధారం

ఆలేరు, గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. ఈ నాలుగు మండలాల గుండా వెళుతున్న బిక్కేరు వాగులో వందలాది మంది రైతులు చేతి బోర్లు (ఫిల్టర్‌ పాయింట్లు) వేసుకుని పంపుసెట్లు బిగించుకుని వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పక్కపక్కనే మూడు, నాలుగు బోర్లు వేసుకున్నా వాగు నీరందిస్తోంది. బిక్కేరు వాగు వెంట భూములు ఉన్న రైతులకు బిక్కేరులోని నీరే ఆధారం. గత ఖరీఫ్‌ సీజనలోనూ వరి నాట్లు వేసిన తర్వాత చేలు పొట్టదశలో బిక్కేరు వాగులో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామేలు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి గత అక్టోబరులో గంధమల్ల రిజర్వాయర్‌ నుంచి బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయించారు. అప్పుడు అడ్డగూడూరు వరకు గోదావరి జాలలు వెళ్లాయి. దాంతో ఈ నాలుగు మండలాల్లో పంటలు ఎండిపోకుండా చేతికి వచ్చాయి.

ఈ యాసంగిలోనూ..

ఆలేరు, గుండాల, ఆత్మకూరు(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు మండలాల చెరువులు, కుంటలు నిండక బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గాయి. దీంతో ఈ యాసంగి (రబీ) సీజనలో బావులు, బోర్ల కింద రైతులు చాలా తక్కువగా సాగు చేశారు. గతంలో ఐదారు ఎకరాలు వరి నాటు వేసే రైతు ఈ సారి ఒకట్రెండు ఎకరాలే నాటు వేశాడు. బిక్కేరు వాగు వెంట ఉన్న రైతులు కూడా వాగులో నీరు దొరుకుతుందో లేదోనని తక్కువగానే వరి నాట్లు వేశారు. ఈ ఏడాది ఇప్పటి (ఫిబ్రవరి మొదటి వారం) నుంచే ఎండలు మండిపోతుండటంతో బిక్కేరు వాగులో నీరు అడుగంటి పోయింది. పంపుసెట్లకు తగినంత నీరు అందక రైతులు బిల్లలు వేస్తున్నారు. వరికి ఇంకా రెండు నెలలు నీరు పారాలి. యాసంగిలో కూడా బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు ఒక్కసారి వదిలితే పంటలు చేతికి వస్తాయని రైతులు భావించారు. రైతుల డిమాండ్‌ మేరకు ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామేలు మరో సారి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి గత జనవరిలో గంధమల్ల రిజర్వాయర్‌ నుంచి బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయించారు. జలాలు గుండాల మండలం అనంతారం వరకు రాగానే కొందరు వ్యక్తులు అనంతారం బ్రిడ్జి వద్ద గడ్డిమోపులు, గడ్డకట్టిన సిమెంటు బస్తాలతో అడ్డుకట్ట వేశారు. గోదావరి జలాలకు అడ్డుకట్ట వేసిన విషయాన్ని గత జనవరి 29న ’ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకరావడంతో స్పందించిన ఎమ్మెల్యే సామేలు వెంటనే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డుకట్టను తొలగింపజేశారు. పిబ్రవరి 3 నాటికి గోదావరి జలాలు గుండాల మండలం అంబాల శివారు వరకు వచ్చి నిలిచిపోయాయి. ఇదేమిటని రైతులు ఆరా తీస్తే రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల నిలిపి వేశారని తెలిసింది. గోదావరి జలాల నిలిపివేతతో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మోత్కూరులో రైతులు కూరెల్ల యాదయ్య, పుల్కరం మల్లేష్‌, గుండెపురి స్వామి తదితరులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నీరు తక్కువగా వదలడం, కొన్ని రోజులు వదిలి, మరికొన్ని రోజులు నిలిపివేయడంతో నీరు వచ్చిన వరకే వచ్చి ఇంకిపోతున్నాయంటున్నారు. ఎండలు మండి పోతుండటంతో నీరు అందక వరి చేలు ఎండిపోతున్నాయని రైతు లు ఆవేదన చెందుతున్నారు. బిక్కేరు వాగులోకి నీరు వస్తే వాగుకు ఇరువైపుల సమీపంలో ఉన్న బావులు, బోర్లలో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. వెంటనే నీరు విడుదల చేసి అడ్డగూడూరు చేరే వరకు నీరు వదలాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

బిక్కేరులోకి గోదావరి జలాలు వదలాలి

బిక్కేరు వాగులోకి వదిలిన గోదావరి జలాలు మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చేరకముందే నిలిపివేశారు. నేను బిక్కేరు వాగులోని నీటిపై ఆధారపడి రెండు ఎకరాలు వరి నాటు వేశాను. వాగులో నీరు అడుగంటి పొలం పారడం లేదు. నాటు ఎండిపోకుండా వరుసలకు పారిస్తున్నాను. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే బిక్కేరు వాగులోకి నీరు వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలి.

-బోడ భాస్కర్‌, రైతు, కొండగడప

మిషన భగీరథ పైపు మరమ్మతు కోసం నిలిపివేశాం

మిషన భగీరథ పైపు పగలడంతో దాని మరమ్మతు కోసం బిక్కేరు వాగులోకి నీటి విడుదల నిలిపి వేశాం. బిక్కేరు వాగులోకి వదిలిన గోదావరి జలాలు దిగువకు చేరకుండా ఏదో ఒక అడ్డంకి వచ్చి నీరు నిలిపి వేయాల్సి వస్తోంది. కొలనుపాక బ్రిడ్జిపైనుంచి నీరు వెళుతుండటంతో నీరు ఎక్కువ వదిలితే బ్రిడ్జిపై ప్రయాణికులు జారిపడి గాయపడుతున్నారు. ఇప్పటికే నలుగురైదుగురు పడి గాయపడ్డారు. అందువల్ల తక్కువ నీరు వదలాల్సి వస్తోంది. ఈ నెల 3నుంచి 150 క్యూసెక్కుల నీరు వదులుతున్నాం. మోత్కూరు, అడ్డగూడూరు చేరే వరకు నీరు వదులుతాం.

-శ్రీనివాస్‌, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ

Updated Date - Feb 06 , 2025 | 12:34 AM