ప్రారంభానికి నోచుకోని వినోబాభావే మందిరం
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:32 AM
యాదాద్రిభువనగిరి జిల్లా భూదానపోచంపల్లిలో భూదానోద్యమ చారిత్రక నేపథ్యానికి స్మృతిచిహ్నంగా నిర్మించిన ‘వినోభామందిరం’ నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.

యాదాద్రిభువనగిరి జిల్లా భూదానపోచంపల్లిలో భూదానోద్యమ చారిత్రక నేపథ్యానికి స్మృతిచిహ్నంగా నిర్మించిన ‘వినోభామందిరం’ నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 18 ఏప్రిల్ 1951న ఆచార్య వినోబాభావే స్ఫూర్తితో ప్రధమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి త్యాగనిరతితో భూదానోద్యమానికి బీజం పడింది. 2012లో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సెప్టెంబరు 11న భూదానోద్యమ స్మృతిచిహ్నం వినోబామందిరం నిర్మాణానికి రూ.50లక్షలు నిధులు మంజూరుచేశారు. వినోబా మందిరం నిర్మించి దశాబ్దం దాటినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
దేశ చరిత్రలోనే 1951 ఏప్రిల్ 18వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించతగిన రోజు. గాంధీజీ ప్రియశిష్యుడిగా గాంధీజీ ఆశయాలు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆచార్య వినోబాభావే పౌనార్ ఆశ్రమాన్ని వీడి దేశమంతటా 11 మంది శిష్యబృందంతో కలిసి పాదయాత్రకు సిద్ధమయ్యారు. అదే సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్ 15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించిన సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ తరుణంలోనే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు, ఖాసీం రిజ్వి సైన్యం అరాచకాలు, ఆగడాలు తీవ్రంగా కలచివేశాయి. నాటి పరిస్థితులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంపై చలించిన ఆయన ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనే దృఢ సంకల్పంతో పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించారు. శాంతియాత్ర కోసం పోచంపల్లికి చేరుకున్న ఆచార్య వినోబాభావేకు అశేష జనవాహని స్వాగతం పలికింది. దళితవాడ సమీపంలోని చెరువుకట్ట వద్ద దళితులతో సమావేశమైన ఆయన వారి యోగక్షేమాలు అడిగే క్రమంలో భూమిస్తే, సాగుచేసుకుని జీవిస్తాం అనే మాట వినబడింది. ఆ ఒక్క మాట మహా ఉద్యమానికి తెరలేపింది. అదేరోజు సాయంకాలం వినోబాజీ భూస్వాములు ఎవరైనా ముందుకు వచ్చి భూమి ఇవ్వగలరా? అని కోరారు. వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి సేద్యయోగ్యమైన 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తానని ప్రకటించారు. అదే నిండు సభలో దానరూపేణా లభించిన భూమిని వినోబాభావే దళితులకు పంచి భూదానోద్యమానికి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి పోచంపల్లి తన పేరును ‘భూదాన’పోచంపల్లిగా మార్చుకుంది. యాధృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన భూదానోద్యమానికి ఊపిరిపోసి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
పోచంపల్లికి మూడుసార్లు ..
ఆచార్యవినోబాభావే పోచంపల్లిలో మూడు సార్లు పర్యటించారు. దేశవ్యాప్తంగా ఆయన 1.70 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. అలాగే రెండోసారి ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి 1955 డిసెంబరులో పాదయాత్ర ప్రారంభించి 1956లో గాంధీ వర్ధంతి రోజున జనవరి 30న పోచంపల్లికి చేరుకున్నారు. సేకరించిన 1.70 లక్షల ఎకరాల్లో 1.26 లక్షల ఎకరాల భూమికి మాత్రమే చట్టబద్ధత కలిగిఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం వేల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు ఆనాడు పంచిపెట్టారు.
అదే స్ఫూర్తితో 80 వేల కిలోమీటర్లు, 40లక్షల ఎకరాలు
భూదానోద్యమ స్ఫూర్తితో భూదాన ఉద్యమం ఒక స్పష్టమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమం వేలాది కార్యకర్తలను ఆకర్షించింది. 1970 వరకు 80 వేల కిలోమీటర్ల పాదయాత్రతో దాదాపు 40 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. వివిధ రాషా్ట్రల్లో లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుంచి సేకరించి భూమిలేని పేదలకు పంచారు. నేటికీ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇలా భూదానోద్యమానికి అంకురార్పణ జరిగిన పోచంపల్లిని ‘భూదాన గంగోత్రి’గా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొన్నారు. 1976లో పోచంపల్లికి మూడోసారి సందర్శించిన వినోబాభావే అప్పటి పరిస్థితులపై ఆరా తీశారు. జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పోచంపల్లి సందర్శించి వినోబాభావేతో సమావేశమై ఆయన కోరిన విధంగా పోచంపల్లిలో పీర్ల కొట్టాన్ని ‘వినోబా మందిరం’గా నిర్మించారు. ఇక్కడ వినోబా మందిరంగా నేటికీ ప్రసిద్ది చెందింది.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవతో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన కిరణ్‌కుమార్‌రెడ్డి 2012లో సెప్టెంబరు 11న భూదానపోచంపల్లిని సందర్శించారు. భూదానోద్యమ స్మృతిచిహ్నమైన వినోబామందిరం శిథిలమైందని భూదాన బోర్డు చైర్మన గున్నా రాజేందర్‌రెడ్డి, ఆనాటి ప్రముఖ కాంగ్రెస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కోరిక మేరకు వినోబామందిరం పునర్నిర్మాణానికి రూ.50లక్షలు నిధులు మంజూరు చేశారు. మందిరం నిర్మించిన అనంతరం ప్రభుత్వం దీనిని ఇబ్రహీంపట్నంలోని వినోబా డెవల్‌పమెంట్ సర్వీస్ సొసైటీ(వీడీఎ్‌సఎ్‌స)కి అప్పగించింది. అయితే నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. వినోబామందిరం నిర్వహణ బాధ్యత రాష్ట్ర భూదానయజ్ఞ బోర్డు చైర్మన గున్నా రాజేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వినోబా మందిరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వినోబా మందిరాన్ని ప్రారంభించాలి
యునెస్కో గుర్తింపుతో భూదానపోచంపల్లి నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భూదాన గంగోత్రిగా ఖండాంతర ఖ్యాతి చెందిన ఈ ప్రాంతంలోని భూదానోద్యమ స్మృతి చిహ్నమైన వినోబా మందిరాన్ని ప్రారంభించాలి. 12ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నిర్మించిన వినోబా మందిరాన్ని సీఎం రేవంతరెడ్డి ప్రారంభించాలని కోరుతున్నాం.
ఏలె భిక్షపతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర నాయకులు, భూదానపోచంపల్లి