వటపత్రశాయికి వరహాల లాలీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:12 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడు మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చాడు.

చిన్నికృష్ణుడి అలంకారంలో పంచనృసింహుడు
యాదగిరిగుట్ట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడు మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం స్వామి వారిని అర్చకులు బాలకృష్ణుడిగా అలంకరించి మండపంలో అధిష్టింపజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో ప్రదర్శించిన బాల్యచేష్టల లీలామహత్యాలను భక్తులకు అర్చకులు వివరించారు. అంతకుముందు పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో అలంకరించి వటపత్రంపై శయనించిన చిన్నికృష్ణుడిని పుష్పాలంకృతమైన పల్లకిలో భక్తుల జయజయ ధ్వానాల మధ్య తిరుమాడవీధుల్లో ఊరేగించారు. రుత్వికులు, అర్చకులు, వేదపండితులు పారాయణాలు, వేదపఠనాలతో మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి అలంకార సేవను ఆలయ ఉత్సవ మండప వేదికపై అధిష్టింప చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాసో్త్రక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు సేవను తిరువీధిలో భుజస్కందాలపై మోయగా సేవ ఎదుట సిరి(భువనగిరి) నాట్యమండలి కోలాటం, కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీనకుమార్‌శర్మ, గజ్వేల్లి రమే్‌షబాబు, రఘు, జూశెట్టి క్రిష్ణ, పర్యవేక్షకులు నాగుల మహే్‌షగౌడ్, దీరావత రామరావునాయక్, రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, దాసోజు నరేష్, రాకే్‌షరెడ్డి, ముద్దసాని నరేష్, వేముల వెంకటేశ పాల్గొన్నారు.
హోమ పూజలు
విశ్వశాంతి.. లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ఉత్తర తిరువీధిలోని యజ్ఞశాలలో హోమం జరిపారు. రుత్వికులతో శ్రీమద్భాగవతం, రామాయణ, పంచసూక్తాలను పారాయణం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం జరిపి లోకశాంతికి భగవంతుడి అనుగ్రహం కోసం వైదిక ప్రార్థన చేశారు.
హంసవాహన సేవల్లో ...
భగవంతుడు తన మనోనేత్రంతో లోకంలోని మంచీచెడులను వేరు చేసే విఽధానికి ప్రతీకగా నీళ్లను, పాలను వేరు చేసే హంసపై మంగళవారం రాత్రి భక్తజనులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో చేపట్టిన ఊరేగింపుతో పండిత, పామర జనులకు దర్శన భాగ్యం కల్పించారు. హంస వేదస్వరూపమైనందున, జ్ఞానాత్మకమైన వేద ప్రాముఖ్యం గలది కావడంతో వాహనసేవను ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. దివ్యవేద వైభవాన్ని పరమాత్ముడు భక్తులకు అందజేయుటయే ఈ అలంకారసేవ ప్రత్యేకం.
అలరిస్తున్న సంగీత సభలు
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత సభలకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆధ్మాతిక సాంస్కృతిక వైభవం కనిపిస్తోంది. యాదగిరిగుట్టపై స్వయంభువులుగా కొలువైన లక్ష్మీనారసింహుడిని కొలుస్తూ కళాకారుల నృత్యాలు, భజనలు, మంగళవాయిద్యాలు, వైదిక ప్రార్థన, అలంకరణ, వాహన సేవల ప్రవచనాలతో ఆధ్యాత్మిక చింతన భక్తకోటిని పరవశింపజేశాయి. మంగళవారం రాత్రి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్యంలో సినీ నేపథ్యగాయకులు సంగీత విభావరి నిర్వహించారు. అన్నమయ్య, శ్రీరాముడిని స్తుతిస్తూ విభావరి చేపట్టగా పెద్దసంఖ్యలో భక్తులు ఆసక్తిగా ఆలకించారు. ఉదయం ఆరు నుంచి 6.45 గంటల వరకు ప్రారంభమైన శ్రీ రామభక్త భజన మండలి (రాయగిరి), 6.45 నుంచి 7.30 గంటల వరకు సాయిబాబ సేవా సమితి(రామంతాపూర్) భజనలు, 7.30 నుంచి 8 గంటల వరకు ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యం, 8 నుంచి 8.30 గంటల వరకు అర్చక బృందం వైదిక ప్రార్థన, 8.30 నుంచి 10 గంటల వరకు విజయకుమారాచార్య స్వామి (హైదరాబాద్) నృసింహ అవతార వైభవం, వాహన సేవల ప్రవచనాలు, 10 నుంచి 11.30 గంటల వరకు వేదవతి భాగవతారిణి(ఒంగోలు) సీతారామ కల్యాణం హరికథ గానం, 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు సిరి(భువనగిరి) కూచిపూడి నృత్యం, 12.15నుంచి ఒంటిగంట వరకు సీహెచ రఘునందన(వేములవాడ) భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలంరించాయి.