Share News

ప్రయాణం.. ప్రాణ సంకటం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:57 AM

పల్లె సీమలంటే పచ్చని చెట్లు.. చల్లని గాలులు.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ గ్రామానికి వెళ్లాలంటే నల్లని తారురోడ్లపై వెళ్తుంటే సంబురంగా ఉండేది. ఇవన్నీ ఒకప్పుటి మాటలు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.

ప్రయాణం.. ప్రాణ సంకటం

ఈ రోడ్లపై ప్రయాణం అంటేనే జంకుతున్న ప్రజలు

సూచిక బోర్డుల్లేక నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలు

రోడ్లపై గుంతలు.. నిలిచిన కంకర

పట్టించుకోని అధికారులు

కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న రహదారులు

(ఆంధ్రజ్యోతి-ఆలేరు రూరల్‌): పల్లె సీమలంటే పచ్చని చెట్లు.. చల్లని గాలులు.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ గ్రామానికి వెళ్లాలంటే నల్లని తారురోడ్లపై వెళ్తుంటే సంబురంగా ఉండేది. ఇవన్నీ ఒకప్పుటి మాటలు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. నేడు ఏ పల్లెకు వెళ్లాలన్నా అడుగడుగునా గుంతలే దర్శనమిస్తాయి. వాటిపై వెళ్తే నడుములు విరిగి, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయి. పట్టపగలు వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల దుస్థితి దయనీయంగా ఉంది. ఎటు చూసినా గుంతలతో రాళ్లు తేలి అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ దారిలో వెళ్లాలంటేనే ప్రజలు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

రోడ్లపై గుంత లు పడినా, మూలమలుపుల వద్ద సబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల ప్రజలు తమ ఊరికి పోవాలన్నా ప్రమాదం అంచున ప్ర యాణం చేయాల్సిన దుస్థితి. రోడ్లపై ఉన్న గుం తలు లేచిన కంకరతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులు జేబులు నింపుకుంటూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈదారిగుండా ప్రజాప్రతినిధులు, నాయకులు నిత్యం ప్రయాణిస్తు న్నా పట్టించుకోని దుస్థితి. పాడైపోయిన పల్లెదారులు అసలక్కడ రోడ్డుందానన్న పరిస్థితిలో ఉన్నాయి. మోతాదుకు మించి భారీ బరువుతో కూడిన వాహనాలు పయనిస్తుండడంతో నాసిరకంగా వేసిన రోడ్డు గుంతలమయంగా మారుతున్నాయని ప్రజలు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.

రాత్రయితే సరి.. పయనించాలంటే భయం

పలు గ్రామాలకు వెళ్లేదారులు ప్రమాదకరం గా మారాయి. రోడ్డు పక్కనే పాత బావులు, చి న్న చిన్నదారులు కావడంతో రెండు వాహనాలు వెళ్లలేకుండా ఉన్నాయి. రాత్రి సమయంలో ఎదురుగా ఏవైనాపెద్ద వాహనం వచ్చిందా రోడ్లు క న్పించని దుస్థితి. కొత్త వ్యక్తులు వస్తే ఆ దారిన ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి. గుంతల రోడ్లతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు.

నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఇలా..

ఆలేరు మండలం గుండ్లగూడెం, శివలాల్‌తం డా, పటేల్‌గూడెం, శ్రీనివాసపురం గ్రామాలకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. ఏ రోడ్డు చూసినా అదే పరిస్థితి. గుండాల మండలం వెల్మజాల నుంచి గుండాల వరకు, మరిపడిగ నుంచి మండల కేంద్రానికి బ్రాహ్మణపల్లి నుంచి సీతారామపురం వరకు, రామారం నంచి అంబా ల వరకు కంకర తేలిన రోడ్లు ఉన్నాయి. రాజాపేట మండలంలోని బేగంపేట, పొట్టిమర్రి, పారుపల్లి వాగులపై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. పలు మధిర గ్రామాల్లో సైతం రోడ్లు సరిగాలేవు. నెమిల నుంచి పిట్టలగూడెంవరకు అసలే రోడ్డు సౌకర్యం లేదు. ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెపహాడ్‌-కొరటికల్‌ మధ్య ఉన్న బీటీ రోడ్డుకు గుంతలుపడ్డాయి. సింగారం నుంచి వయా కాల్వపల్లి మీదుగా మొరిపిరాల వరకు మట్టి రోడ్డే దర్శనమిస్తుంది. సరగండ్లగూడెంకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కప్రాయపల్లినుంచి ఉప్పలపహాడ్‌ వరకు వెళ్లే రోడ్డు కూడా వాహనాలకు ఇబ్బందికరంగా మారింది. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామం నుంచి తాళ్లగూడెం వరకు, బాహుపేటనుంచి యాసోజిగూడెంనకు ఉన్న లింకురోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మోటకొండూరు మండలం నూతన మండలకేంద్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నేటికీ లింక్‌ రోడ్లు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. మోటకొండూరు నుంచి దిలావర్‌పూర్‌, వర్టూర్‌ నుంచి మాటూరు వరకు, మోటకొండూరు నుంచి కాటేపల్లి వరకు ఉన్న రోడ్లు సక్రమంగా లేవు. కాటేపల్లి ప్రధాన రహదారి వెంట నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు గత కొన్నేళ్ల నుంచి పూర్తికాకపోవడంతో ఈదారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పనులు పూర్తికాగా కంకర తేలి ఉండడంతో నిత్యం దుమ్ము లేస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుర్కపల్లి మండలనుంచి యాదగిరిగుట్ట వరకు వేసి నాలుగు లేన్ల రోడ్లు అసంపూర్తిగా ఉన్న రోడ్డు మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బొమ్మలరామారం మండలం మర్యాల నుంచి చౌదరిపల్లి, కాల్వకుంట్ల తండా, గోవింద తండా మీదుగా చీకటి మామిడివరకు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బస్సులు సరిగ్గా రావడంలేదు. శామిర్‌పేట వాగుపై కాజిపేట వద్ద ఫైఓవర్‌ శిథిలావస్థకు చేరింది. తారురోడ్లు గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు చేసుకుంటుండడంతోపాటు వాహనాలు సైతం ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనదారులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మించిన రోడ్లన్నీ మూన్నళ్లకే చెడిపోతున్నాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

రవాణా సౌకర్యం కల్పించాలి : దిబావత్‌ శోభ, వాలుతండా, బొమ్మలరామారం మండలం.

మండలంలోని చీకటిమామిడి, మర్యాల వరకు రోడ్డు సరిగ్గాలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సొంత వాహనాలపై వెళ్లాలన్న ఇబ్బందులు తప్పుతలేవు. రోడ్లకు మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలి. మా గ్రామానికి బస్సు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి.

మెరుగైన రోడ్లు ఏర్పాటు చేస్తాం : కరుణాకర్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ, ఆలేరు.

ప్రజలకు రవాణా సౌకర్యంతోపాటు మెరుగైన రోడ్లను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం. ప్రజలు రోడ్ల దుస్థితిని మా దృష్టికి తేవాలి. మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తాం.

బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి : గుంటి మధుసుదన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, జాల, రాజాపేట

గంధమల్ల చెరువు నుంచి కాళేశ్వరం జలాలు మోత్కూరు ప్రాంతానికి వెళ్తుండడంతో మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదు. చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రజలు, వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఓవర్‌ బ్రిడ్జి పనులను పూర్తి చేసి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలి.

Updated Date - Feb 26 , 2025 | 12:57 AM