రెండోరోజూ కొనసాగిన వాహనాల రద్దీ
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:05 AM
సంక్రాంతి పం డుగకు స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రెండో రోజూ రద్దీ నెలకొంది.

చౌటుప్పల్ టౌన, కేతేపల్లి, కోదాడరూరల్, మునగాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పం డుగకు స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రెండో రోజూ రద్దీ నెలకొంది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విజయవాడ వైపు ఐదు వరుసల్లో వాహనాల్లో దూసుకెళ్లాయి. వాహనాలు ఒకదానికొకటి తాకుతూ వెళ్లడంతో కొన్నిచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకోవడం కనిపించింది. తుప్రానపేట, కైరతాపురం గ్రామాల సమీపంలో ట్రాఫిక్‌జాం ఏర్పడి వాహనాలు నెమ్మ దిగా ముందుకు కదిలాయి. రెండు నిమిషాలకు దూరానికి 15నిమిషాలు పట్టిందని వాహనదారులు తెలిపారు. తుప్రానపేట వద్ద రోడ్డు మరమ్మతులతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ప్రమాదాలు జరుగకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదనరెడ్డి, సీఐలు మన్మథకుమార్, విజయ్‌మోహన తెలిపారు.
ఫ కోదాడ మండలం కొమరబండ జంక్షన, కట్టకొమ్ముగూడెం, దుర్గాపురం, చిమిర్యాల క్రాస్‌రోడ్డు, రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల రద్దీ కనిపించింది. పోలీసులు దగ్గరుండి రోడ్డు దాటించారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
పాలేరు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు
గత ఏడాది వరదల కారణంగా పాలేరు బ్రిడ్జికి పడిన గండిని నేషనల్ హైవే అధికారులు పూర్తిచేయించారు. దీంతో శుక్రవారం రాత్రి నుంచే ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పనులను పండుగ నాటికి పూర్తి చేయడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగాయి.
జాతీయ రహదారిపై నాలుగుచోట్ల ప్రమాదాలు
వాహనాల రద్దీతో నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు. కొమరబండ వై-జంక్షన వద్ద ముందున్న కారుని వెనుకున్న కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని హైవే అధికారులు క్రేన సహాయంతో తొలగించారు. దోరకుంట వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టగా ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పాలేరు బ్రిడ్జిపై ముందు వస్తున్న కారుని వెనుక కారు ఢీకొట్టడంతో రెండుకార్లు దెబ్బతిన్నాయి. హైవే అధికారులు క్రేన సహాయంతో వాటిని పక్కకి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దుర్గాపురం బైపాస్ వద్ద కూడా ఓ కారు ప్రమాదానికి గురైంది.
ఫ మునగాల మండలంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొద్దులచెరువు, తాడ్వాయి, మునగాల, ముకుందాపురం ఆకుపాముల, మాధవరం గ్రామాల సమీపంలోని రోడ్డు పాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను ఏర్పాటుచేశారు. రోడ్డు మీద స్టాప్ బోర్డులను ఏర్పాటుచేసి, ఆయా గ్రామస్థులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాహనాలను సిగ్నల్‌పడిన విధంగా నిలిపివేశారు.
టోల్‌ప్లాజాల వద్ద...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ మీదుగా రెండు రోజుల్లోనే 1,50,000 వాహనాలు వెళ్లినట్లు పంతంగి టోల్‌గేట్ ఏజెన్సీ నిర్వాహకులు డీఆర్‌ఎ ఇన్ర్ఫా ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అర్ధరాతి 59వేల వాహనాలు వెళ్లగా, శనివారం 90,000 వాహనాల్లో పంతంగి టోల్‌గేట్ మీదుగా ప్రజలు పండుగకు వెళ్లారు. వీటిలో కార్లు అధికంగా ఉన్నాయి. పంతంగి టోల్‌గేట్ వద్ద 16గేట్లు ఉండగా, 12 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. నాలుగు గేట్ల ద్వారా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను పంపించారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద 12 కౌంటర్లలో ఎనిమిది కౌంటర్లు విజయవాడ వైపు కేటాయించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన వాహనాల రద్దీ శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగింది. రెండు రోజుల్లో దాదాపు 48వేల వాహనాలు ఇరువైపులా ప్రయాణించాయి. ఒక్కో వాహనం ఫాస్టాగ్ స్కాన్ కావడానికి 3-4సెకండ్ల సమయం తీసుకోవడంతో ఏమాత్రం ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలు ముందుకు కదిలి వెళ్ళాయి. శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి శనివారం కొర్లపహాడ్ టోల్‌ప్లాజాను సందర్శించి స్థానిక ఎస్‌ఐ ఎ.శివతేజగౌడ్, టోల్ నిర్వహకులతో పరిస్థితిని సమీక్షించారు.